Akkineni Akhil : అక్కినేని అఖిల్ కటౌట్‌కి ఒక్క మాస్ హిట్ పడితే.. ఈపాటికే స్టార్ హీరోల లిస్ట్‌లో ఉండేవాడు. కానీ అఖిల్ మొదటి సినిమా నుంచి అక్కినేని అభిమానులను నిరాశ పరుస్తునే ఉన్నాడు. ఫస్ట్ సినిమాతోనే మాస్ అటెంప్ట్ చేశాడు అఖిల్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తన పేరునే టైటిల్‌గా పెట్టి అఖిల్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మాస్ వదిలి క్లాస్ బాట పట్టాడు అఖిల్. అయినా కూడా ఒక్క సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు. హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో సోసో రిజల్ట్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీతో మాత్రం ఓ మోస్తరు హిట్ కొట్టాడు. కానీ ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
#Akhil6 ఆరోజే అనౌన్స్మెంట్?
చివరగా ఏజెంట్ సినిమాతో మెప్పించలేకపోయిన అఖిల్.. ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటించలేదు. గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అని, అక్కినేని అభిమానులను ఊరిస్తు వస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ అఫిషీయల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఫైనల్‌గా ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ (Naga Vamshi) అఖిల్ 6వ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టుగా పోస్ట్ చేశాడు. #Akhil6 – April 8th అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా.. అఖిల్ 6 ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తున్నట్టుగా సమాచారం. అందుకే.. నాగవంశీ ఈ అప్డేట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నట్టుగా టాక్ ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోందని ఇండస్ట్రీ టాక్. అలాగే.. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అఖిల్ బర్త్ నాడు ఏప్రిల్ 8వ తేదీన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంటిది ఏదైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీంతో.. అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా ఉంటాయా?
లెనిన్‌తో పాటు.. నందు, అనిల్ అనే కొత్త దర్శకులతో కూడా అఖిల్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అనిల్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ సంస్థ అఖిల్‌తో ఓ సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, సామజవరగమన రైటర్ నందు చెప్పిన కథకు అఖిల్‌కు నచ్చిందని అంటున్నారు. ప్రస్తుతానికైతే.. ఈ సినిమాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాల అనౌన్స్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొత్తంగా అయ్యగారు మాత్రం ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సాలిడ్ అనౌన్స్మెంట్‌తో రాబోతున్నాడు.