Jagapathi Babu : రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి సినిమా ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారన్న సంగతి తెలిసిందే. ఆయన పెట్టే బాహుబలి భోజనం సంతృప్తిగా తిని, ప్రభాస్ మంచితనాన్ని చాలామంది స్టార్స్ పలు వేదికలపై బయట పెట్టారు. అయితే తాజాగా ఈ లిస్టులో జగపతిబాబు చేరినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి, బకాసురుడిలా భోజనం చేసి, కుంభకర్ణుడిలా నిద్ర పోతాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రముఖ నటుడు జగ్గూ భాయ్ ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే తాజాగా జగపతి బాబు ప్రభాస్ తనకు పంపిన ఫుడ్ గురించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అందులో నోరూరించే శాఖాహారం, మాంసాహారం వంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. ఈ వీడియోకి జగపతి బాబు ఆసక్తికరమైన క్యాప్షన్ ను ఇచ్చారు.
‘వివాహ భోజనంబు’ అనే పాటను యాడ్ చేసి “ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగింది. ఆయనకు ఎవ్వరూ చెప్పొద్దు. చెప్తే తను పెట్టే ఫుడ్ తో ఈ బాబు బలి. అది బాహుబలి లెవెల్. పందికొక్కులాగా తిని, ఆంబోతులా పడుకుంటాను” అంటూ జగపతిబాబు (Jagapathi Babu) రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆ వీడియోలో “షూటింగ్ కోసం భీమవరం చేరుకున్నాను. భీమవరం రాజుల ఆతిథ్యం అద్భుతంగా ఉంది. జై భీమవరం, జై రాజులు, జై బాహుబలి, జై ప్రభాస్” అంటూ ప్రభాస్ అతిథ్యంపై జగ్గు భాయ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ లోనే అతిథులకు భీమవరం రుచులు చూపించకుండా వదలరు (Prabhas) ప్రభాస్. అలాంటిది భీమవరం వెళితే అక్కడి మర్యాదను చూపించకుండా వదిలేస్తారా? ప్రభాస్ అంటున్నారు ఆయన అభిమానులు.
అయితే ప్రభాస్ ఇచ్చే బాహుబలి ఆతిథ్యాన్ని మెచ్చుకున్న స్టార్స్ లో జగపతిబాబు (Jagapathi Babu)మొదటి వారేమీ కాదు. ప్రభాస్… రాజమౌళి, దీపికా పదుకొనే, పూజా హెగ్డే, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ తో పాటు, గతంలో తను కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికి రోజూ అత్యంత రుచికరమైన ఫుడ్ ను పంపేవారు అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. కొంతకాలం క్రితం కోలీవుడ్ స్టార్ సూర్య కూడా ప్రభాస్ తో కలిసి మిడ్ నైట్ బిర్యానీ తినడం గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, స్పిరిట్, ఫౌజి, సలార్ 2 : శౌర్యంగ పర్వం, హోంబలే ఫిలింస్ బ్యానర్ పై రెండు సినిమాలు ఉన్నాయి. గత చిత్రాలు ‘సలార్’, ‘కల్కి’ లతో మరోసారి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు ప్రభాస్ (Prabhas). ఇక ఇప్పుడు ‘ది రాజా సాబ్’ అనే రొమాంటిక్ హర్రర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు.