Jr.NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr .NTR) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ , అభిమానులకు అండగా నిలుస్తూ ఎప్పటికప్పుడు గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి ఏదైనా ఈవెంట్ నిర్వహించారు అంటే .. ఆ ఈవెంట్ కి వచ్చిన అభిమానులు తిరిగి క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు ఆందోళన చెందుతూనే ఉంటారు. అంతేకాదు తమ ఈవెంట్ కి వచ్చిన ప్రతి అభిమాని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగంగా వాహనాలు నడపకూడదని చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచిస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు అభిమానుల కోసం మరో శుభవార్తను తీసుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మరి ఏంటా రోజు..? ఆరోజు ప్రత్యేకత ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అభిమానులను కలవడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్..
ముఖ్యంగా అభిమానులు ఎవరైతే తనను కలవాలని, మాట్లాడాలని తాపత్రయపడుతున్నారో.. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక ప్రకటన జారీ చేశారు ఎన్టీఆర్. ఆ ప్రకటనలో ఏముంది అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా తనపై అభిమానులు చూపిస్తున్న గౌరవానికి , అపారమైన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకొని, త్వరలోనే సజావుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, తనను వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారిని కలవడానికి నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని, శాంతిభద్రతల సమస్యలు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం కూడా అవసరం అవుతుంది. కాబట్టి అభిమానులు దయచేసి ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు ఎన్టీఆర్.
పాదయాత్ర చేయకండి అంటూ అభిమానులను కోరుతున్న ఎన్టీఆర్..
ముఖ్యంగా అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయకూడదని, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన అభిమానుల ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని మరొకసారి స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఇకపోతే ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. మరి ఎప్పుడు ఆ ఈవెంట్ నిర్వహించబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే..చివరిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి, సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయారు ఎన్టీఆర్ .ఇక ఇప్పుడు బాలీవుడ్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 31’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ‘దేవర 2’ సినిమా కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా వరుస సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తన అభిమానుల కోసం కూడా ఒక రోజు కేటాయిస్తుండడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దూరం పెట్టడమే సంచలన సభకు దారితీసిందా..?
త్వరలో ఎన్టీఆర్ సంచలన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసుల పర్మిషన్ రాగానే ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారట.బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పై నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ.. ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో నందమూరి కుటుంబ సభ్యుల పేర్లు అందరివి ఉన్నాయి.కానీ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తల్లి షాలిని పేర్లు మాత్రం ఇక్కడ ప్రస్తావించకపోవడం వారికి కాస్త అవమాన భారంగా అనిపించిందని అభిమానులు కామెంట్లు చేశారు. దీనికి తోడు మరొకవైపు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలకృష్ణ సోదరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు. కానీ ఎన్టీఆర్ను పిలవకపోవడంతో.. ఈ విషయంపై ఎన్టీఆర్ తీవ్ర మనస్థాపం చెందారని అటు ఫిలిం వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఈ సభను ఏర్పాటు చేసి అభిమానులను నేరుగా కలవబోతున్నట్లు అభిమానులు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.