CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ మంగళవారం మరో కీలక ఘట్టానికి వేదికగా మారింది. ఇప్పటికే కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదికను సైతం ప్రవేశపెట్టడం విశేషం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దళితులకు అన్ని రంగాలలో అపార అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. తాను 20 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, తన రాజకీయ జీవితంలో తనకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇటువంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని, చరిత్ర పుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలకు చర్యలు చేపట్టిందని, అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ సీఎం అభినందనలు తెలిపారు.
Also Read: PM Modi: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. లోక్ సభలో మోడీ కీలక ప్రకటన.. ఇకపై..
ఆనాడు ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ అందిస్తే తనను సభ నుంచి బయటకు పంపించారని, కానీ నేడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. రంగుల గోడలు అద్దాల మేడలు కాదని, చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సభ్యులందరూ సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.