Kangana Ranaut: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కన్నడ చిత్ర పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలపై అటు ఆ సినీ పరిశ్రమలో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా సినీ సెలబ్రిటీలు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక రాజకీయంగా కూడా ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై చాలామంది సినీ సెలబ్రిటీలకు స్పందించాలని ఉన్నా స్పందించలేదు. ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు.. ఇలాంటి వాటిపై వెంటనే స్పందించే మనస్తత్వం ఉంది కాబ్టటి కర్ణాటక మీడియాతోనే దీనిపై తన స్పందన తెలియజేసింది కంగనా. ప్రస్తుతం కర్ణాటకలోని దేవాలయాలు అన్నీ సందర్శించడంలో బిజీగా ఉన్న కంగనా.. డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.
దేవుడే రక్షిస్తాడు
డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కంగనా ఘాటుగా బదులిచ్చింది. “పవిత్ర గ్రంథాల ప్రకారం.. ఇంద్రుడు, అర్జునుడితో పాటు మరికొందరు గొప్ప వ్యక్తులు కళలను నేర్చుకున్నారు. దేవుడు ఎల్లప్పుడూ కళాకారులను రక్షిస్తాడు. సరస్వతి మాత కళలకు దేవత. ఎవరైనా కళాకారుల నట్లు, బోల్ట్‌లు బిగించాలని ప్రయత్నిస్తే.. అటువంటి సమయంలో వారిని రక్షించడానికి విష్ణువు అవతారమెత్తుతాడని గుర్తించుకోవాలి, లేదా మరెవరైనా కూడా వారిని రక్షిస్తారు’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కంగనా. ఇక కౌప్‌లోని శ్రీ హోస మరిగుడి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత కటీల్‌లోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వెళ్లింది కంగనా రనౌత్ (Kangana Ranaut).
అలా మొదలయ్యింది
సాధారణంగా సినిమా రంగానికి సంబంధించి ముఖ్యమైన ఈవెంట్లు ఎక్కడ జరిగినా ఆయా ఇండస్ట్రీ ప్రముఖులు హాజరవుతూ ఉంటారు. అయితే 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కన్నడ చిత్ర పరిశ్రమలోని చాలామంది నటీనటులు హాజరు అవ్వకపోవడంపై డిప్యూటీ సీఏం డీకే శివకుమార్ (DK Shivakumar) అసహనం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ‘‘కన్నడ గడ్డ, భాష గురించి సినీ సెలబ్రిటీలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఇకపైన స్పందించకుంటే వాళ్ల నట్లు, బోల్టులను ఎలా బిగించాలో నాకు తెలుసు’’ అంటూ డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు.
Also Read: రెండు డిజాస్టర్ల తర్వాత కూడా పూరి మారలేదు.. మళ్లీ ఛార్మీతోనే మూవీ..
స్పందన లేదు
కర్ణాటక రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా కన్నడ పరిశ్రమ నుండి ఎటువంటి మద్ధతు రావడం లేదని ఆయన మండిపడ్డారు.ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు అటు సినీ రంగంలోనే కాకుండా, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది. ముఖ్యంగా రష్మిక మందనా (Rashmika Mandanna)ను ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రమ్మని ఆహ్వానించడానికి తన ఇంటికి వెళ్తే తను అసలు కన్నడ అమ్మాయి కాదు అన్నట్టుగా మాట్లాడిందని ఒక ఎమ్మెల్యే తనపై ఆరోపణలు చేశారు. రష్మికపై మొదలయిన ఈ ఆరోపణలు మెల్లగా కన్నడ పరిశ్రమలోని అందరి సెలబ్రిటీ వైపుకు మళ్లాయి. అయినా దీనిపై చాలావరకు సినీ సెలబ్రిటీలు వెంటనే స్పందించడానికి ఇష్టపడడం లేదు.