IAS Supremacy : భారతీయ ప్రభుత్వ అధికారుల్లో ఆలిండియా సర్వీసెస్ సర్వీసెస్.. పోస్టులకు అత్యున్నతమైన అధికారం ఉంటుంది. దేశంలోని కార్యనిర్వహణ మొత్తం వీరి కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. అలాంటి.. పోస్టుల్లోనూ వివిధ శాఖలుగా పరిపాలనా విభజించి ఉంటుంది. వీరిలో.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులు తరచుగా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారులపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తారని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవేవో.. అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు కాదని.. తమ సర్వీసులో చూసిన వివిధ సంఘటనల ద్వారా తాము ఆ అభిప్రాయానికి వచ్చినట్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తెలిపారు.
అటవీకరణ, అటవీ వనరుల పరిరక్షణను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పరిహార అటవీకరణ నిధి నిర్వహణ-ప్రణాళిక అథారిటీ (CAMPA) నిధుల దుర్వినియోగంపై దాఖలైన ఓ కేసు విచారణ సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంలోనే కేసు పరిశీలనలో భాగంగా.. న్యాయమూర్తులు BR గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఐఏఎస్ అధికారుల అధికార ఆధిపత్యం గురించిన విషయాల్ని చర్చించారు. ప్రభుత్వ ప్లీడర్లు, న్యాయమూర్తులుగా వారి అనుభవం ఆధారంగా.. IAS అధికారులు IFS, IPS అధికారులపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారని.. ఈ ధోరణి దేశంలోని అన్ని రాష్ట్రాలలో నిరంతర సమస్యగా ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి ప్రవర్తన కారణంగా.. ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం అవుతుంటుందని, చాలా మంది అధికారుల మధ్య మనస్పర్థలు వచ్చిన సందర్భాలున్నాయని వ్యాఖ్యానించింది.
తన సర్వీసులో మూడేళ్లు ప్రభుత్వ ప్లీడర్‌గా, 22 సంవత్సరాలు న్యాయమూర్తిగా తన అనుభవంలో ఎన్నో చూశానన్న జస్టిస్ గవాయ్.. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రవర్తనను తాను చాలాసార్లు గమనించానని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ వివాదం ఉంటుంది. ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాల్లో పని చేసేందుకు ఈ శాఖలు పనిచేస్తున్నా… వారంతా దాదాపు ఒకే క్యాడర్ లో భాగమైనప్పటికీ.. ఐఏఎస్‌లను ఉన్నతాధికారులుగా ఎందుకు పరిగణించాలి అనే విషయం ఎప్పుడూ మిగతా వారికి బాధాకరంగానే ఉంటుందని అన్నారు.
నిధుల దుర్వినియోగం కేసును పరిశీలిస్తూ.. పరిహార అటవీకరణ నిధులను ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు వినియోగించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా CAMPA నిధులను ఉపయోగించాలని సూచించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అధికారుల మధ్య ఇటువంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు.
Also Read : ISI Honey trap : భారత్ లోని ఆ రైల్వే స్టేషన్ పై పాక్ మహిళల గురి – తియ్యని మాటలతో మాయచేస్తుంటారు
CAMPA నిధిని పచ్చదనాన్ని పెంచడానికి ఉపయోగించాలి కానీ, వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు ఉపయోగించడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. అలాగే.. సరైన సమయానికి వడ్డీలను డిపాజిట్ చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహార అటవీకరణ నిధి నిర్వహణ, ప్రణాళిక అథారిటీ (CAMPA) భారతదేశ పర్యావరణ విధాన చట్రంలో భాగమని.. ఇది దేశ అభివృద్ధి అవసరాలను, దాని అటవీ వనరులను పరిరక్షించడాని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.