Kangana Ranaut: సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి ఫైనల్ టార్గెట్ ఆస్కార్. హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా.. ఆస్కార్ స్టేజ్‌పై నిలబడాలని, ఆ అవార్డ్ అందుకోవాలని కెరీర్ ప్రారంభించినప్పటి నుండి కలలు కంటూనే ఉంటారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలో ఆస్కార్ గురించి కలలు కనేవారి సంఖ్య ఎక్కువే. కానీ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మాత్రం ఆస్కార్ తనకు అసలు అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడి మరో కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ డైరెక్ట్ చేసి, యాక్ట్ చేసిన ‘ఎమర్జెన్సీ’ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండగా.. తను ఇలాంటి కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
డైరెక్టర్‌గా సక్సెస్
సినీ పరిశ్రమలో ఒకవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు డైరెక్షన్ చేయాలనుకునే హీరోయిన్స్ చాలా తక్కువ. ఒకవేళ హీరోయిన్లకు డైరెక్షన్ చేయాలనుకునే కోరిక ఉన్నా.. యాక్టింగ్ కెరీర్‌ను పక్కన పెట్టి మరీ ఆ రిస్క్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కంగనా రనౌత్ మాత్రం ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీతోనే డైరెక్టర్‌గా మారింది. క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా ‘మణికర్ణిక’ అనే మూవీ మొదలయ్యింది. కానీ పలు కారణాల వల్ల క్రిష్ మధ్యలోనే దర్శకత్వం నుండి తప్పుకోవడంతో వేరే దారి లేక మిగతా సినిమాను తానే డైరెక్ట్ చేసింది కంగనా. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకి అడుగుపెట్టి తాజాగా తను డైరెక్టర్‌గా రెండో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఎమర్జెన్సీకి ఆస్కార్ రావాలి
ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించారు. అసలు ఆ ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, దాని వల్ల దేశ రాజకీయాల్లో జరిగిన మార్పులు ఏంటి అనే విషయాన్ని వివరిస్తూ కంగనా రనౌత్ నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రమే ‘ఎమర్జెన్సీ’ (Emergency). ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా పర్వాలేదనిపించింది. అంతే కాకుండా తాజాగా ఈ మూవీ ఓటీటీలో కూడా విడుదలయ్యింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాను చాలామంది ప్రేక్షకులు చూశారు. ‘ఎమర్జెన్సీ’ చూసి ఈ సినిమా ఇండియా తరపున ఆస్కార్‌కు వెళ్లాలి అంటూ ఒక ప్రేక్షకుడు ప్రశంసించగా దానికి కంగనా రియాక్షన్ అందరినీ షాక్‌కు గురిచేసింది.
Also Read: పవిత్రమైన దేవాలయంలో నీచమైన పని.. ఓర్రీపై కేసు ఫైల్..
నేషనల్ అవార్డ్స్ చాలు
‘ఎమర్జెన్సీ’కి ఆస్కార్ రావాలి అనే కామెంట్‌పై కంగనా రనౌత్ (Kangana Ranaut) రియాక్ట్ అయ్యింది. ‘‘కానీ అమెరికా ఎప్పుడూ తన అసలు మొహాన్ని చూపించాలని అనుకోదు. అది ఎదుగుతున్న దేశాలను ఎలా వెనక్కి తోసి, తొక్కేసి, చేతులు విరిచేస్తుందో ఎప్పటికీ బయటపడదు. అదే ఎమర్జెన్సీలో బయటపడింది. వాళ్ల సిల్లీ ఆస్కార్ వాళ్ల దగ్గరే ఉండనివ్వు. మనకు మన నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. ఆస్కార్ విషయంలో కంగనా చేసిన కామెంట్స్ షాకింగ్‌గా ఉన్నా తన యాటిట్యూడ్ గురించి తెలిసిన వారు ఇదంతా కామన్ అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.