Kantara 2: శాండిల్ వుడ్ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ‘కిర్రిక్ పార్టీ’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. హీరోగా కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈయన నుంచి వచ్చిన చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రంలో నటించడమే కాదు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇక ఈ సినిమా ప్రాంతీయంగా మొదట విడుదలైనా.. ఆ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ ఒక్క సినిమా రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో తీస్తే కోట్ల రూపాయలు లాభం వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో ఈ చిత్రానికి ‘కాంతారా : చాప్టర్ వన్’ పేరుతో పార్ట్ 2 కూడా మొదలుపెట్టారు.
కాంతారా 2కి అడుగడుగునా అడ్డంకులే..
అయితే ఏ ముహూర్తాన ఈ సినిమా ప్రకటించారో కానీ అప్పటినుంచి అడ్డంకులు, అవరోధాలు ఏర్పడుతున్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ కపిల్, నటుడు రాకేష్ పూజారి, మిమిక్రీ ఆర్టిస్ట్ విజు వికే ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడం, దీనికి తోడు శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ కూడా మునిగిపోయింది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ నిన్న రాత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో నిజం లేదని చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము ఒక సెట్ వేశామని, గాలి వల్ల అది దెబ్బతినిందని ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో ఎవరూ లేరని కూడా వివరించారు. అయితే చిత్ర బృందం ఎన్ని విధాలుగా భయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ప్రాణాలు పోతున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రిషబ్ శెట్టి ని హెచ్చరించిన అర్చకులు..
దీనికి తోడు రిషబ్ శెట్టి ని అర్చకులు హెచ్చరించిన విధానం కూడా ఇప్పుడు అందరిలో సరికొత్త అనుమానాలకు తెర లేపుతోంది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి, జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు రిషబ్ శెట్టి. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు కూడా ఇచ్చినట్లు సమాచారం.” నీ కార్యము సఫలం కాకుండా పాడు చేయడానికి కొంతమంది పథకాలు చేస్తున్నారు. అయితే నువ్వే కాస్త మెలుకువగా ఉండి నీ సినిమాను ముందుకు నడిపించాల్సిన బాధ్యత నీపైనే ఉంది. అయితే అన్నివేళలా నీకు ఆ పంజుర్లి దేవుడు అండగా ఉంటాడు” అని తెలిపారట. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి . అటు రిషబ్ శెట్టి కూడా ఎంత కష్టం వచ్చినా సరే అనుకున్న తేదీకి అంటే అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం, భగవంతుడి తోడు రిషబ్ శెట్టికి ఏ విధంగా సహకరిస్తాయో చూడాలి.
ఇప్పటివరకు జరిగిన ఆర్టిస్టుల ఆకస్మిక మరణాలు..
ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు ఆకస్మిక మరణం పొందారు.
1. కేరళకు చెందిన ఎం.ఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్టుగా కాంతారా చాప్టర్ వన్ లో నటించారు. ఉడిపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌపర్ణికా నదిలో కపిల్ ఈత కొడుతూ.. మే 6న సాయంత్రం 4:00 గంటలకు నదిలో మునిగి చనిపోయారు.
2. కామెడీ కిలాడిగళు ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న రాకేష్ పూజారి కమెడియన్గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈయన కూడా ఈ సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు అయితే మే 12న ఉడిపిలో ఒక పెళ్లి వేడుకలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు. ఇకపోతే అప్పట్లో ఈయన అంత్యక్రియలకు రిషబ్ హాజరు కాలేదని, పెద్ద వివాదం నడిచినా.. ఆ తర్వాత రాకేష్ పూజారి కుటుంబ సభ్యులను రిషబ్ శెట్టి కలవడంతో సమస్య సద్దుమణిగింది.
3. సరిగ్గా నెల రోజులకు అంటే జూన్ 12న ఇదే సినిమాలో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు విజు వికే కూడా గుండెపోటుతో మరణించారు.
ఆకస్మిక మరణాలే కాదు.. ఆకస్మిక ప్రమాదాలు కూడా..
ఇకపోతే సడన్ గా ఆర్టిస్టులు మరణించడమే కాదు సెట్లో ఆకస్మిక ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
1.గత ఏడాది నవంబర్లో కొల్లూరు మార్గం లో జూనియర్ ఆర్టిస్టులంతా మినీ బస్సులో వెళ్తుండగా.. ఆ బస్సు పల్టీ కొట్టింది. అందులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. కానీ ఎవరికి ప్రాణాపాయం కలగలేదు.
2.ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కోసం కుందాపుర వద్ద భారీ సెట్ వేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే సుడిగాలి కారణంగా సెట్ మొత్తం ధ్వంసం అయ్యి ఆస్తి నష్టం కలిగింది.
3. అంతేకాదు హాసన్ జిల్లా హేరూరు గ్రామ శివారులలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఆ ప్రాంత ప్రజలకు, చిత్ర బృందానికి వివాదం రాజుకుంది. షూటింగ్ కోసం అడవులు నాశనం చేస్తున్నారని , పేలుళ్లు జరిపారు అని, వన్యప్రాణులకు హాని కలిగించారని గ్రామస్తులు ధర్నా చేయగా.. అటవీశాఖ అధికారులు తనిఖీ చేసి షూటింగ్ ఆపివేశారు. ఇలా అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్న ఈ చిత్రం ఏవిధంగా తెరపైకి వస్తుందో చూడాలి.
ALSO READ:Hyderabad: ఘనంగా డిగ్రీ కళాశాల కొత్త బ్రాంచ్ ప్రారంభం!