Kota Srinivas Rao: తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే.. తెలుగు సినిమా హాస్య విభాగంలో కొన్ని కాంబినేషన్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి గొప్ప కాంబినేషన్లలో ఒకటి కోటా శ్రీనివాస్ రావు- బాబు మోహన్ జంట. ఈ ఇద్దరూ కలిసిన ప్రతి సినిమా ఒక హాస్య పంటలా మొలిచింది. వారి కామెడీ టైమింగ్, పరస్పర సహకారం, స్క్రీన్ కెమిస్ట్రీ అన్నీ కలసి సినిమాలను మరపురాని వినోదంగా మార్చాయి. ఈ జంటను 1980ల చివర నుండి 1990లలో అనేక చిత్రాలలో చూడగలిగాం.. “కాబోయే అల్లుడు”, “భలే బుల్లోడు”, “ముత్యాల ముగ్గు”, “అబ్బాయి గారు” ఇంకా ఎన్నో.. వీరి మధ్య ఉండే మాటల యుద్ధం, వ్యక్తిత్వ వైవిధ్యం, ముక్కుసూటి పాత్రల తీరు ప్రేక్షకులను నవ్వుల హడావుడిలోకి నెట్టేవి. ఈ జంట వెండితెరపై చేసిన హాస్యాన్ని నేటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ఇలాంటి రెండు హాస్య దిగ్గజాలు ఇటీవల ప్రముఖ నటుడు అలీ హోస్ట్ చేస్తున్న టాక్ షో “అలీతో సరదాగా” వేదికపై మరోసారి కలుసుకున్నారు. అలీ ప్రత్యేకంగా వారిద్దరినీ ఒకే ఎపిసోడ్‌కి ఆహ్వానించడం, వారిని ఒకే సారి చూసే అవకాశం రావడం ప్రేక్షకులకు ఓ పండుగ వలె అనిపించింది.
పాత జ్ఞాపకాలు తిరిగొచ్చిన వేళ
షో ప్రారంభమైనప్పటినుంచి కోటా, బాబు మోహన్ మధ్య మాటల తూటాలు మొదలయ్యాయి. చిన్న చిన్న మాటల్లోనే హాస్యాన్ని, చిలిపితనాన్ని చాటుకుంటూ వెళ్ళారు. ఒక దశలో కోటా శ్రీనివాస్ రావు తన సహజమైన పద్ధతిలో బాబు మోహన్‌ను “వాడ్ని” అని సంబోధించారు. ఇదే మాట తర్వాత ఆయన స్వయంగా తానే సరిచేసుకుంటూ,”సారీ రా వాడ్ని అన్నాను.. నువ్వు ఫీల్ అవొద్దు..” అంటూ పలికారు.
ఆ మాటకు బాబు మోహన్ తనదైన శైలిలో నవ్వుతూ..”నేనేం ఫీల్ కానులే.. నువ్వు అనొచ్చు లే..” అని సాదాసీదాగా చెప్పారు.
దీనికి కోటా శ్రీనివాస్ వెంటనే స్పందిస్తూ,”అనొచ్చని నాకూ తెలుసు.. కానీ నువ్వు ఏదైనా ఫీల్ అవుతావేమో అనిపించి అన్నాను రా..” అని అనడం, ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, సహృదయతను తేటతెల్లం చేసింది.
ఈ చిన్న సంభాషణే షోలో హాస్య ప్రవాహాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ఒక్క క్షణానికి పాత సినిమాల్లో వారిద్దరూ మాటల యుద్ధం చేసుకున్న దృశ్యాలు ప్రేక్షకుల మదిలోకి వచ్చాయి. ఆత్మీయతతో కూడిన ఆ మాటలతో ప్రేక్షకులు, అలీతో సహా నవ్వుల్లో మునిగిపోయారు.
హాస్యం వెనుక దాగిన రహస్యం.. కోటా చెప్పిన మధురానుభూతి
ఈ సందర్భంగా కోటా శ్రీనివాస్ రావు షోలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “చాలా సినిమాల్లో నేను బాబు మోహన్‌ను కాలితో తన్నే సీన్లు ఉండేవి. అప్పుడు చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండేది.. నేను వాడ్ని ఎన్ని సార్లు తన్నాను.. వీడు ఎలా భరిస్తున్నాడో అనిపించేది,” అని చెప్పారు.
అయితే వెంటనే చిరునవ్వుతో, “కానీ వాడిని టచ్ చేస్తే చాలు.. ముందుకు వెళ్లి పడిపోవడం అతని స్టైల్.. టైమింగ్‌లో వాడి జాగ్రత్తలు, నటన, సహనం అన్నీ అద్భుతం,” అంటూ బాబు మోహన్‌పై ఉన్న తన గౌరవాన్ని ప్రదర్శించారు.
ఈ వ్యాఖ్యలు షోలో నవ్వులను పెంచినప్పటికీ, వీరిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన అవగాహన, పరస్పర గౌరవాన్ని కూడా చాటిచెప్పాయి.
Faria Abdullah : ట్రోమా లేదు ఏం లేదు… కామెడీ కోసం చెప్పా అంతే.. కవర్ చేసుకున్న చిట్టి