Naga Vamsi : ఇప్పుటి తరం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో నిర్మాత నాగవంశీ (Suryadevara Nagavamsi) కూడా ఉన్నారు. ఆయన దూకుడుగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తున్నారు. తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆయన మూవీ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా తాము సినిమాలు చేస్తేనే, వెబ్సైట్లో రివ్యూ రాసేవారు సర్వైవ్ అవుతారన్నట్టుగా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన సినిమాలను దమ్ముంటే బ్యాన్ చేయమని ఛాలెంజ్ కూడా విసరారు. ఈ నేపథ్యంలోనే అసలు నాగ వంశీ గత రెండేళ్లలో చేసిన సినిమాలు ఎన్ని? వాటిలో హిట్లు ఎన్ని? అనే వివరాల్లోకి వెళితే…
గత రెండేళ్లలోనే 12 సినిమాలు
నాగ వంశీ నిర్మించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే హీరో, డైరెక్టర్ కంటే ఎక్కువ హడావుడి ఈ నిర్మాతదే కనిపిస్తుంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు ఎప్పటికప్పుడు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అదే రేంజ్ లో వివాదాలు కూడా ఉంటాయనుకోండి. అయితే మరే ప్రొడ్యూసర్ చేయని సాహసాన్ని ఈ ప్రొడ్యూసర్ చేస్తున్నారని చెప్పాలి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ ప్రొడ్యూసర్ తన సొంత బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఏకంగా 12 సినిమాలను తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అందులో రెండు సినిమాలకు మాత్రం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
నాగ వంశీ 2023 నుంచి ‘మ్యాడ్ స్క్వేర్’ దాకా 10 సినిమాలను నిర్మించారు. ఆ లిస్ట్ లో బుట్ట బొమ్మ, సార్, మ్యాడ్, ఆదికేశవ, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ఉన్నాయి. ఇందులో ‘బుట్ట బొమ్మ’ మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. సార్, మ్యాడ్, లక్కీ భాస్కర్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు బ్లాక్ బస్టర్ లిస్ట్ లో ఉన్నాయి. ‘డాకు మహారాజ్’ మూవీ అబౌవ్ యావరేజ్ గా నిలవగా, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ , ‘ఆడికేశవ’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ మాత్రం యావరేజ్ టాక్ తో ఆగిపోయింది.
నెగటివ్ కామెంట్స్ పై అసంతృప్తి
ఈ రెండేళ్లలో డిస్ట్రిబ్యూటర్ గా నాగవంశీ ‘లియో’ తెలుగు వెర్షన్, ‘దేవర’ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ‘రెట్రో’ తెలుగు వెర్షన్, ‘కింగ్డమ్’ సినిమాలను నాగవంశీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాను చంపే ప్రయత్నం చేయొద్దు అంటూ నాగ వంశీ ఆవేదనను వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. రివ్యూలు ఇవ్వడం వరకు ఓకే గాని, కంటెంట్ లేని కథకి కలెక్షన్లు ఎందుకు వస్తున్నాయి అంటూ అంత డీప్ గా వెళ్లి జడ్జ్మెంట్ ఇవ్వడం ఎందుకు? సినిమాను చంపడం ఎందుకు? అనేది ఆయన ప్రశ్న. మరి రెండేళ్లలో 12 సినిమాలు చేస్తే అందులో 5-6 సినిమాలు కూడా హిట్ కాకపోవడానికి నెగెటివ్ కామెంట్స్, రివ్యూలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. దీంతో కొంతమంది నాగవంశీ కామెంట్స్ ను విమర్శిస్తుంటే, మరి కొంతమంది ఆయన చెప్పింది కరెక్టేనని సమర్థిస్తున్నారు.