Sanam Teri Kasam 2: కొన్ని సినిమాలు విడులదయినప్పుడు అవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేదు. కానీ ఆ సినిమాలోని ఏదో ఒక అంశం ప్రేక్షకులకు మెల్లగా నచ్చడం మొదలుపెడుతుంది. అలా సోషల్ మీడియాలో అలాంటి సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. కల్ట్ క్లాసిక్ అంటూ ఫీలవుతుంటారు. విడుదలయినప్పుడు ఫ్లాప్ అయ్యి, రీ రిలీజ్ సమయంలో సూపర్ హిట్ అవుతున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ‘సనమ్ తేరీ కసమ్’ కూడా ఒకటి. ప్రస్తుతం రీ రిలీజ్ జరుపుకున్న ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా.. ఇదే సమయంలో దీని సీక్వెల్ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రీ రిలీజ్ హంగామా
2016లో ‘సనమ్ తేరీ కసమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఇది సాడ్ సినిమా అని, ఎండింగ్ అస్సలు బాలేదని.. చాలామంది దీనిని పక్కన పెట్టారు. సరిగా ఆదరించలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన సీన్స్, సాంగ్స్ అన్నీ మెల్లగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యింది. అలా ఆ సీన్స్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చడం మొదలయ్యింది. అది గమనించిన మేకర్స్.. ఇన్నాళ్ల తర్వాత ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. అంతే కాకుండా ఇప్పటికే ‘సనమ్ తేరీ కసమ్’కు సీక్వెల్ వస్తుందని ప్రకటించిన మేకర్స్.. తాజాగా దీని విడుదల తేదీ గురించి చెప్తూ షూటింగ్ అప్డేట్ అందించారు.
వాలెంటైన్స్ డేకు కలుద్దాం
‘సనమ్ తేరీ కసమ్’ను రాధికా రావు, వినయ్ సప్రు డైరెక్ట్ చేశారు. అయితే వీరు ఈ మూవీకి కథ రాసుకున్నప్పుడే దీనికి రెండు భాగాలు రాసేసుకున్నామని, హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరో ప్రయాణం ఎటువైపో రెండో భాగంలో స్పష్టంగా చూపిస్తామని తాజాగా బయటపెట్టారు దర్శకులు. ఈ మూవీ క్లైమాక్స్‌లో హీరోయిన్ చనిపోయినా కూడా తన డైలాగ్స్ వినిపించడం అనేది కావాలని చేశామని, ఎందుకలా చేశామో సీక్వెల్ చూస్తే అర్థమవుతుంది అన్నారు. ‘సనమ్ తేరీ కసమ్ 2’ ఇప్పటికే రెడీ అయిపోయింది. 2025 వాలెంటైన్స్ డేకు ఈ మూవీ మొదటి భాగం రీ రిలీజ్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సీక్వెల్‌ను 2026 వాలెంటైన్స్ డేకు విడుదల చేయాలని అనుకుంటున్నామంటూ రివీల్ చేశారు మేకర్స్.
Also Read: యశ్ ‘టాక్సిక్’ నుండి ఇంటర్నేషనల్ అప్డేట్.. ఇది అస్సలు ఊహించలేరు.!
అప్పుడే ఎదురుచూపులు
‘సనమ్ తేరీ కసమ్ 2’ (Sanam Teri Kasam 2)కు సంబంధించిన పాటలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మరోసారి ఇందర్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి హర్షవర్ధన్ రాణే సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే ‘సనమ్ తేరీ కసమ్’ను థియేటర్లలో మరోసారి చూసి ఎమోషనల్ అవుతున్న ప్రేక్షకులు.. సీక్వెల్ కోసం కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హీరో హర్షవర్ధన్ నేరుగా ఈ సీక్వెల్ గురించి అధికారికంగా ప్రకటించాడు. మొదటి భాగం ఎపిక్‌గా నిలిచిపోవడంతో మేము రెండో భాగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామంటూ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో ఇప్పటినుండే ‘సనమ్ తేరీ కసమ్ 2’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.