Thomas Burleigh Kurishingal : ప్రముఖ మాలీవుడ్ నటుడు థామస్ బర్లీ కురిషింగల్ (Thomas Burleigh Kurishingal) మంగళవారం (డిసెంబర్ 17) కన్నుమూశారు. గత కొన్నాళ్ళుగా థామస్ బర్లీ వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 92 ఏళ్లు. తాజాగా అనారోగ్యంతో ఆయన కన్ను మూశారన్న వార్తతో మాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూవీ లవర్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1932 సెప్టెంబరు 1న కొచ్చిలో జన్మించిన థామస్ (Thomas Burleigh Kurishingal) బర్లీ కురిషింగల్ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. థామస్ అనే ఈ సీనియర్ నటుడు కురిషింగల్ కేజే బెర్లీ అనే స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడు. మరోవైపు అతని తల్లి అన్నీ బర్లీ… ఇండిపెండెన్స్ రాకముందు ఫోర్ట్ కొచ్చిన్‌లో కల్లు దుకాణాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన ప్రముఖ కార్యకర్త. ఇక థామస్ కూడా 21 ఏళ్ల అతి పిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడిగా నిలిచారు.
థామస్ (Thomas Burleigh Kurishingal) 1953లో మలయాళ చిత్రాలలో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. 21 సంవత్సరాల వయస్సులో, అతను సత్యన్‌తో కలిసి మలయాళ చిత్రం ‘తిరమల’లో ప్రధాన పాత్ర పోషించారు. 1953లో రిలీజైన ఈ సినిమాతోనే ఆయన తన సినీ రంగ ప్రవేశం చేసాడు. తరువాత ఆయన యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్లి హాలీవుడ్‌లో ఫ్రాంక్ సినాత్రా వంటి తారలతో కలిసి పని చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్‌లో యాక్టింగ్ కోర్సు తీసుకున్న తర్వాత, హాలీవుడ్‌లోని ‘నెవర్ సో ఫ్యూ’ (1959)తో సహా కొన్ని టీవీ షోలలో చిన్న పాత్రలు పోషించాడు. థామస్ పిల్లల కోసం ‘మాయ’ అనే ఆంగ్ల చిత్రాన్ని కూడా నిర్మించాడు.
థామస్ (Thomas Burleigh Kurishingal) నటుడు మాత్రమే కాదు మంచి స్కిల్స్ ఉన్న మెజీషియన్, వయోలిన్ ప్లేయర్, పెయింటర్, రచయిత కూడా. బియాండ్ హార్ట్ (2000), ఫ్రాగ్రెంట్ పెటల్స్ (2004), ఓ కేరళ (2007), కార్టూన్ సేక్రెడ్ సావేజ్ (2017) వంటి రచనలు చేసి రచయితగా కూడా ఆయన గుర్తింపు పొందారు. థామస్ పెయింటింగ్ గలియన్ అంతర్జాతీయ ఉత్సవాల్లో కూడా ప్రదర్శించారు. 1969లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన ‘ఇటు మనహో?’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీని తర్వాత 1985లో ‘వెల్లరికపట్నం’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
థామస్ (Thomas Burleigh Kurishingal)కు భార్య సోఫీ, పిల్లలు తాన్య, తరుణ్, తమీనా ఉన్నారు. థామస్ పిల్లలకు పెళ్లిళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. ఇక థామస్ ఫోర్ట్ కొచ్చిలోని తన ఇంట్లోనే నివాసం ఉండేవారు. అయితే కొన్నాళ్ళ నుంచి ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడి చికిత్స పొందుతూ థామస్ (Thomas Burleigh Kurishingal) మంగళవారం తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.