Shine Tom Chacko : ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)ను గత 10 ఏళ్ల నుంచి వెంటాడుతున్న కేసు నుంచి ఊరట లభించింది. కోర్టు తాజాగా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ హీరో ఇన్నేళ్లుగా ఏ కేసులో చిక్కుకుని పోరాడుతున్నారు? చివరికి క్లీన్ చిట్ ఎలా వచ్చింది? అనే వివరాలను తెలుసుకుందాం.
అసలు ఏం జరిగిందంటే?
2015లో కేరళలో భారీ ఎత్తున నార్కోటిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో అప్పట్లో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదయింది. కేరళలోని కడమంత్ర ప్రాంతంలోని ఒక ప్లాట్ లో నిర్వహించిన సోదాల సందర్భంగా అక్కడ పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలతో పాటు, ఈ 8 మంది పట్టుబడ్డారు. అక్కడ మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందని ముందే సమాచారం అందుకున్న పోలీసులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఇంటి పై దాడి చేశారు. అక్కడే 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అందులో షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కూడా ఒకరు. మిగిలిన ఏడుగురితో పాటు మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది.
అంతేకాకుండా వారికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమానిస్తున్న మరో ముగ్గురు అనుమానితులను కూడా అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు కొనసాగుతూ వచ్చింది. ఇక తాజాగా ఇన్నేళ్లకు ఈ కేసులో షైన్ టామ్ చాకోకు ఉపశమనం లభించింది.
ఎర్నాకులం అదనపు సెషన్స్ కోర్టు తగినన్ని సాక్ష్యాలు లేవన్న కారణంతో షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)తో పాటు ఇతర ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించినట్టు తెలుస్తోంది. మొదట్లోనే పోలీసులు ఆయన మాదక ద్రవ్యాలను తీసుకున్నారని ప్రూవ్ చేయడంలో విఫలమయ్యారు. వాస్తవానికి ఇన్వెస్టిగేషన్ బృందం ఢిల్లీ, హైదరాబాద్ లోని ల్యాబ్లోకి పంపిన శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్ళని కనుక్కోలేక పోయారు. దీంతో చివరికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి ఆ ఎనిమిది మంది నిందితులను విడుదల చేసింది.
మలయాళంలో షైన్ టామ్ చాకో బిజీ
ఇక ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ యాక్టర్స్ లో షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కూడా ఒకరు. రీసెంట్ గా ఆయన మమ్ముట్టి హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’లో షైన్ టామ్ చాకో నటనపై ప్రశంసల వర్షం కురిసింది. అలాగే మోహన్ లాల్ హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘L2: ఎంపురాన్’, మమ్ముట్టి కొత్త చిత్రం ‘బాజూకా’ వంటి రాబోయే మలయాళ చిత్రాలలో కూడా అతను కనిపించనున్నాడు. ‘L2: ఎంపురాన్’ మూవీ బ్లాక్ బస్టర్ మలయాళ మూవీ ‘లూసిఫర్’లు రీమేక్ గా రాబోతోంది. మలయాళ నటుడు, ‘సలార్’ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ భారీ బడ్జెట్ మూవీకి దర్శకత్వం వహించారు.