పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించింది. ఆ బాంబుల ధాటికి కనీసం 30మంది చనిపోయారని అంచనా. అయితే ఈసారి చనిపోయింది పాకిస్తాన్ శత్రుదేశాలకు చెందినవారు కాదు, పాకిస్తాన్ పౌరులే ఆ బాంబుల వల్ల ప్రాణాలు వదిలారు. అయితే ఇది పొరపాటున జరిగిందేమీ కాదు. ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్ వాయుసేన, పాకిస్తాన్ పౌరుల్ని చంపుకుంది. అయితే ఆ దేశం ఎందుకిలా చేసింది?
ఫైటర్ జెట్ల నుంచి బాంబులు..
పాకిస్తాన్ వాయుసేనకి చెందిన యుద్ధ విమానాలు ఈరోజు బాంబుల వర్షం కురిపించాయి. ఖైబర్ జిల్లాలోని మాత్రె దారా గ్రామంపై ఈ దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ దాడి జరిగింది. తిర్హా లోయలోని ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. తేరుకునే లోపే చాలామంది విగత జీవులుగా మారారు. మరికొందరు ప్రాణ భయంతో ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లు ఎల్‌ఎస్-6 రకం బాంబుల్ని జారవిడిచాయి. దాదాపు 8 బాంబులు మాత్రె దారా గ్రామంపై పడినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో దాదాపు 30మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వందమందికి పైగా గాయాల పాలయ్యారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లే దారులు ఇరుకిరుగ్గా ఉండటంతో సహాయక చర్యలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
ఎందుకీ దాడి..?
ఏ దేశమైనా సొంత పౌరుల్ని ఎందుకు చంపుకుంటుంది..? ఆ మాటకొస్తే పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాదుల్ని సైతం పెంచి పోషిస్తుంటాయి. అలాంటిది సొంత పౌరుల్ని ఆ దేశం ఎందుకు చంపుకోవాల్సి వచ్చిందనేదే అసలు ప్రశ్న. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో బాంబుల దాడులు జరిగాయి. ఈసారి కూడా అక్కడ బాంబుల దాడి జరిగింది. పాకిస్తాన్ వాయుసేన తమ టార్గెట్ రీచ్ అయిందో లేదో తెలియదు కానీ సామాన్య పౌరులు మాత్రం చనిపోయారు. ఈ దాడులపై పాక్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ సైన్యం కానీ అధికారికంగా స్పందించలేదు. పాక్ పౌరులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో విమర్శలను ఎదుర్కోడానికి వారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈలోగా దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పాక్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రజల ఆగ్రహం..
పాకిస్తాన్ వాయుసేన చేసిన దాడికి సామాన్యుల ప్రాణాలు బలికావడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. అసలు దాడులు ఎందుకు చేశారు, వారి టార్గెట్ ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రపంచ మానవ హక్కుల కార్యకర్తలు కూడా పాకిస్తాన్ చేసిన పనిపై మండిపడుతున్నారు. ఎలాంటి సైనిక ఆపరేషన్లలో కూడా సామాన్య పౌరులు చనిపోవడం మంచిది కాదని వారు అంటున్నారు. పాకిస్తాన్ లో జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందలాదిమంది క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. పాకిస్తాన్ వాయుసేనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.