45 Years for Punnami Nagu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఏంటో కొత్తగా తెలపాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే హిట్ సినిమాలు ఉండటం తో పాటు కొన్ని ప్రత్యేకమైన పాత్రలు కూడా మెగాస్టార్ కెరీర్ లో ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాము లక్షణాలున్న మనిషిగా ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటనను కనబరిచిన తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక నటుడుకి సరైన పాత్ర దొరికితే ఎలా ఉంటుందో ఆ పాత్రతో మెగాస్టార్ చిరంజీవి ప్రూవ్ చేశారు. ఇప్పటికే కూడా ఆ సినిమా చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.
పున్నమినాగు కథ
నాగులు ఒక పాములు ఆడించుకునే వ్యక్తి. పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు. నాగులు తండ్రి చిన్నప్పటి నుంచి అతనికి కొంచెం కొంచెం పాము విషం అతని తినే తిండిలో కలిపి ఇస్తుంటాడు. దీనివల్ల అతనికి పాము కరిచినా ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ అతను ఒక కన్యను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అతనికి కలిసిన అమ్మాయిలందరూ అతనిలో ఉన్న విషానికి బలవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక సారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది. నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఆ రహస్యాన్ని నాగులుకి వెల్లడిస్తాడు. నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అతని చర్మం పాము కుబుసం లాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండమీద నుంచి దూకి మరణిస్తాడు.
45 సంవత్సరాలు పూర్తయింది
పున్నమినాగు సినిమా ఎం. రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైంది. నేటికీ ఈ సినిమా విడుదలై 45 సంవత్సరాలు పూర్తయింది. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కన్నడలో ఘన విజయం సాధించిన ‘హున్నిమియే రాత్రియాళి’ అనే చిత్రానికి ‘పున్నమినాగు’ రీమేక్ గా తెరకెక్కింది. మెగాస్టార్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని సినిమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి చేసిన పాత్ర నాగులు కూడా ఒకటి అని చెప్పాలి.
Also Read: Akkineni Nagarjuna : ధనుష్ , రజినీకాంత్ సెట్స్ లో ఏం చేస్తారో తెలుసా?