Basavatarakam Hospital In AP : అమరావతికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు హీరో నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna). ఇప్పటికే హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ (Basavatarakam Indo-American Cancer Hospital) ద్వారా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ని ప్రారంభించబోతున్నట్టు తాజాగా బాలయ్య వెల్లడించారు.
ఏపీలో క్యాన్సర్ ఆస్పత్రి
ఈరోజు హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ను ప్రారంభించారు బాలయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటను బయట పెట్టారు. అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించబోతున్నట్టు అధికారికంగా పరకటించారు.
ఐదేళ్లుగా మూలాన పడ్డ అమరావతి రాజధాని పనుల్ని తిరిగి స్టార్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఆయన ఈ గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. అయితే బాలయ్య న్యూ ఇయర్ సందర్భంగా అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన ప్రకటనను ముందే వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దానికి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టే ప్రాంతాన్ని రీసెంట్ గా హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, నటుడు అయిన బాలయ్య సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో కలిసి పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో హెచ్డి విద్యుత్ లైన్లు అడ్డుగా ఉండడంతో వాటిని తొలగించాలని సిఆర్డిఏ అధికారులు ట్రాన్స్కో కు లేఖ రాయగా, ఇప్పటికే దానికి సంబంధించిన కాంట్రాక్టు స్టార్ట్ చేశారు.
ఇక ఫేస్ వన్ లో ఇక్కడ 300 పడకలతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలని ప్లాన్ చేశారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. అంతేకాకుండా ఆస్పత్రి నిర్మాణానికి యాజమాన్యం ఇప్పటికే పలు డిజైన్లను తయారు చేయగా, బాలయ్య రెండుసార్లు సిఆర్డిఏ కార్యాలయానికి వచ్చి కమిషనర్ తో దీనికి సంబంధించి సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. విద్యుత్ లైన్ల తొలగింపు వర్క్ పూర్తయ్యాక దీనికి సంబంధించిన నిర్మాణ పనులు స్టార్ట్ చేయబోతున్నారు.
బసవతారకం ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్మెంట్
ఇక ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని బాలయ్య హైదరాబాద్ లో ఉన్న బసవతారకం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ఫ్రీ ట్రీట్మెంట్ ను కూడా అనౌన్స్ చేశారు. అవసరమైన వారికి ఉచిత చికిత్స అందిస్తామని ఆయన వెల్లడించారు.
సెట్స్ పై ‘అఖండ 2’
బాలయ్య ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ‘అన్ స్టాపబుల్’ షోను హోస్ట్ చేస్తూనే, మరోవైపు వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్ టాక్ తెచుకున్నప్పటికీ పలుచోట్ల బ్రేక్ ఈవెన్ పూర్తి కాలేదనే టాక్ నడిచింది. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.