Sri Simha Wedding : టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ళ హడావుడి నడుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్థం జరగగా, తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. కీరవాణి తనయుడైన శ్రీ సింహ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. అయితే తాజాగా ఆయన పెళ్లి ఎప్పుడు జరగబోతోంది అన్న విషయం బయటకు వచ్చింది. మరి శ్రీ సింహ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు ఖరారు చేశారో తెలుసుకుందాం పదండి.
రీసెంట్ గా రిలీజ్ అయిన “మత్తు వదలరా 2 ” (Mathu vadalara 2) సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీ సింహ. ఆస్కార్ అవార్డు విన్నర్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ ఇప్పటిదాకా మత్తు వదలరా (Mathu vadalara), తెల్లవారితే గురువారం (Thellavarithe Guruvaram), ఉస్తాద్ (Ustaad) వంటి సినిమాల్లో హీరోగా నటించారు. అయితే అన్ని సినిమాల్లో కంటే “మత్తు వదలరా” సినిమాకు సీక్వెల్ గా రిలీజ్ అయిన “మత్తు వదలరా 2 ” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రీసెంట్ గా శ్రీ సింహ ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ సీనియర్ హీరో, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీ మోహన్ మనవరాలు… మాగంటి రాగతో శ్రీ సింహా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు సీనియర్ నటుడు నరేష్, రాజమౌళి ఫ్యామిలీ, అలాగే పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట ఏడడుగులు ఎప్పుడు వెయ్యబోతున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. కోడూరి శ్రీ సింహ పెళ్లి… మురళీ మోహన్ మనవరాలు రాగతో డిసెంబర్ 14న జరగబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు గాని, త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.
మరోవైపు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా డిసెంబర్ లోనే జరుగుతుంది. కాగా ఈ జంట ఆగస్టు 8న హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే నాగచైతన్య, శోభిత పెళ్లికి కూడా అతి కొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని అంటున్నారు. మొత్తానికి 2024 డిసెంబర్ లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇటు సెలబ్రిటీల పెళ్లిళ్లు, అటు కొన్ని స్పెషల్ సినిమాలతో ఈ డిసెంబర్ తెలుగు మూవీ లవర్స్ కు చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది.