Gopi Sundar: మలయాళం నుండి వచ్చిన నటీనటులు మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్‌కు కూడా టాలీవుడ్‌లో సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌లో గోపీ సుందర్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన తల్లి లివి సురేశ్ బాబు (Livi Suresh Babu).. తన 65వ ఏట కన్నుమూశారు. కేరళలోని కుర్కెన్చెరీలోని తన నివాసమైన అజంతా అపార్ట్మెంట్స్‌లో లివి సురేశ్ బాబు కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
నాతోనే ఉన్నావు అమ్మ
గోపీ సుందర్ (Gopi Sundar) తల్లి మరణవార్తను తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు. తన తల్లి మరణ వార్తను స్వయంగా తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు గోపీ సుందర్. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. రెస్ట్ ఇన్ పీస్ అమ్మ. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’ అని ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.
ఎమోషనల్ పోస్ట్
గోపీ సుందర్ షేర్ చేసిన పోస్ట్ చూసి తన ఫ్యాన్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు. తనకు ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు. తన తల్లి మృతికి సంతాపం తెలియజేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. 2006లో విడుదలయిన ‘నోట్‌బుక్’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు గోపీ సుందర్. కానీ అది కూడా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మాత్రమే తనకు అవకాశం దక్కింది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడానికి మాత్రమే తనను ఎంపిక చేశారు మేకర్స్. తన మ్యూజిక్ ప్రేక్షకులకు అంతగా నచ్చింది. మలయాళంలోనే కాకుండా కెరీర్ మొదట్లోనే హిందీ, తమిళ భాషల్లో కూడా తన మ్యూజిక్‌తో ప్రయోగాలు చేసి అన్నీ భాషా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు గోపీ సుందర్.
Also Read: సూపర్ హీరో పాత్రలో సూర్య.. మలయాళ దర్శకుడితో కలిసి ప్రయోగం..
కెరీర్‌లో బ్రేక్
గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఇష్టపడిన మేకర్స్.. తనకు మెల్లగా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ముందుగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ సినిమాకు మ్యూజిక్‌ను అందించి కెరీర్‌ను మొదటి బ్రేక్ అందుకున్నాడు గోపీ సుందర్. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలు తన ఖాతాలో పడ్డాయి. ఏడాదికి అరడజనకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. తెలుగులో ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.