Suchitra : గతంలో సింగర్ సుచిత్ర (Suchitra) ‘సుచి లీక్స్’ (Suchi Leaks) పేరుతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఎప్పుడు చూసినా ఈ బ్యూటీ ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేయడం, అది హాట్ టాపిక్ గా మారడం చూసాం ఇప్పటిదాకా మనం. కానీ తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ సుచిత్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేడీ సింగర్ గా పేరు తెచ్చుకున్న సుచిత్ర (Suchitra) మ్యూజిక్ డైరెక్టర్ శక్తి ఆర్ సెల్వను ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఈ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. సెల్వ, సుచిత్ర ఇద్దరూ కలిసి ఒక ఆల్బమ్ ను రూపొందించారట. దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు సుచిత్ర రావట్లేదని, పైగా తన ఫోటోలు కూడా ఎక్కడా ఉపయోగించ కూడదంటూ షరతు విధించిందని సెల్వ చెప్పుకొచ్చారు.
నిజానికి గత కొంతకాలంగా సుచీ లీక్స్ వివాదంతో సుచిత్ర పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలిగిన సుచిత్ర (Suchitra) ‘సుచి లీక్స్’ రేపిన వివాదం తర్వాత.. ఆమె జీవితం తారుమారు అయింది. అలాంటి సింగర్ కి మళ్ళీ అవకాశం ఇస్తే ఆమె తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తోంది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ విషయం గురించి సెల్వ మాట్లాడుతూ “సింగర్ సుచిత్ర (Suchitra) తో కలిసి ‘టైటానిక్ సన్ని సన్ని’ అనే మ్యూజిక్ ఆల్బమ్ ను రూపొందించాము. ఈ సాంగ్ ప్రమోషన్ కోసం ఆమె అస్సలు సహకరించట్లేదు. పైగా సాంగ్ రికార్డింగ్ టైంలో నా పట్ల దురుసుగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా బయట పెట్టాను. మహిళల్లో తనకు మంచి పేరు ఉందనే కారణంతో, తన పేరు, ఫోటో ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదు అంటూ సుచిత్ర షరతు విధించింది. కే బాలచందర్, కార్తీక్ రాజా, వైరా ముత్తు వంటి వారిపై ఆమె అనే ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం ఆమె నటించిన ఆల్బమ్ సాంగ్ గురించి ప్రమోషన్ చేయమంటే ససేమిరా చేయనంటూ చెప్పేస్తోంది. గత రెండేళ్ల నుంచి ఆమెకు అసలు అవకాశాలే లేవు. ఈ క్రమంలోనే ఆమెకు అవకాశం ఇచ్చి, అందరూ మర్చిపోయిన ఆమె వాయిస్ ను శ్రోతలకు వినిపించాలనే ఉద్దేశంతో ఈ ఆల్బమ్ ను తెరకెక్కించాము” అంటూ శక్తి ఆర్ సెల్వ కామెంట్స్ చేశారు.
‘కంద’ అనే సినిమాకు మ్యూజిక్ అందించిన సెల్వ అనారోగ్యం కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికైనా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఎదురు చూస్తున్న సెల్వకి సుచిత్ర రూపంలో ఇలా అడ్డంకులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదంపై సుచిత్ర ఎలా స్పందిస్తుందో చూడాలి.