Naga Vamsi: రివ్యూలు అనేవి సినిమా రిజల్ట్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది సినీ పరిశ్రమలో నిరంతరం సాగుతున్న చర్చ. అందుకే రివ్యూలను బ్యాన్ చేయాలి, రివ్యూవర్లను బ్యాన్ చేయాలని తరచుగా ఇండస్ట్రీలో ప్రయత్నాలు జరిగినా అవి పూర్తిస్థాయిలో వర్కవుట్ అవ్వడం లేదు. రివ్యూవర్లు మాత్రమే కాదు.. ఒక సినిమా చూసిన తర్వాత ప్రతీ ప్రేక్షకుడు ఆ సినిమాపై తమ అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్తూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఎంతో కొంత సినిమా రిజల్ట్‌పై మాత్రం ఎఫెక్ట్ పడడం ఖాయం. అందుకే సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ నిర్ణయానికి వచ్చారు. ఓవర్సీస్ షోలపై నాగవంశీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
రివ్యూవర్లే టార్గెట్
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరిలో ప్రస్తుతం నాగవంశీ (Naga Vamsi)కి ఉన్న డిమాండ్ వేరే లెవెల్. ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, దానిని ప్రేక్షకుల దృష్టిలో ఇంట్రెస్టింగ్‌గా ఎలా మార్చాలి అని నాగవంశీకి తెలిసిన రేంజ్‌లో మరెవరికీ తెలియదని అనుకుంటూ ఉంటారు. అలాంటి నాగవంశీ తన సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కే అప్‌కమింగ్ సినిమాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తను నిర్మించిన ప్రతీ సినిమా విడుదలయిన వెంటనే రివ్యూవర్లకు ఇచ్చిపడేస్తుంటాడు నాగవంశీ. అందుకే తన అప్‌కమింగ్ సినిమాలను ఈ రివ్యూవర్ల నుండి కాపాడడం కోసం తను ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అవే టైమింగ్స్
మామూలుగా ఇండియాలో కంటే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు త్వరగా ప్రారంభమవుతాయి. అందుకే అక్కడ షో అయిన వెంటనే అక్కడి నుండి రివ్యూలు ఇండియాకు వస్తుంటాయి. దానివల్ల ఇండియాలో మొదటి షో పూర్తి అవ్వకముందే ఓవర్సీస్ నుండి వచ్చే రివ్యూలు.. సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇకపై అలా జరగకూడదని నాగవంశీ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఓవర్సీస్ ప్రీమియర్స్ విషయంలో కూడా ఇండియన్ టైమింగ్స్ ఫాలో అవ్వనున్నారు. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 5 గంటలకే ఓవర్సీస్‌లో కూడా ప్రీమియర్స్ ప్రారంభించాలని సన్నాహాలు మొదలుపెట్టారు.
Also Read: కంటెంట్ లేని సినిమాలు.. రివ్యూలు బ్యాన్ చేయడం వల్ల ఆడేస్తాయా.?
ఆ రెండు సినిమాలతోనే
ప్రస్తుతం నాగవంశీ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం సితార ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమాల వరకే పరిమితమయ్యిందని తెలుస్తోంది. ఒకవేళ తన నిర్ణయం వల్ల సినిమాలకు మంచి జరిగితే ఇతర భారీ ప్రొడక్షన్ హౌస్‌లు కూడా దీనినే ఫాలో అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎన్నో సినిమాలు తెరకెక్కుతుండగా అందులో ముందుగా రెండు సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవే రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’. ఇక ఈ రెండు సినిమాల ఓవర్సీస్ ప్రీమియర్ షోల విషయంలో నాగవంశీ ఇండియన్ టైమింగ్స్‌ను ఫాలో అవుతాడా లేదా అనేదాన్ని బట్టి తను ఏ నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం బయటపడుతుంది. వీటితో పాటు సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ సినిమాను కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడంలో బిజీగా ఉన్నాడు నాగవంశీ.