Manchu Family Controversy : ఇటీవల కాలంలో వివాదాల కారణంగా మంచు ఫ్యామిలీ పరువు, ప్రతిష్టలు బజారుకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల తరబడి సంపాదించుకున్న మోహన్ బాబు (Mohan Babu) పరువును అన్నదమ్ములు మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) ఇద్దరూ గొడవపడి రోడ్డుకెక్కించారు. ఇండస్ట్రీలో పెదరాయుడుగా అందరి సమస్యలు తీర్చే మోహన్ బాబు, ఇంటి గొడవలను మాత్రం ఇంట్లోనే చక్కదిద్దుకోవడంలో ఫెయిల్ అయ్యారు.
ఇండస్ట్రీలో ఎలాంటి గొడవ జరిగినా సరే తానున్నాను అంటూ పెద్దగా వ్యవహరించి, ఆ గొడవలు సద్దుమణిగేలా చేసే ఆయన విష్ణు – మనోజ్ మధ్య జరుగుతున్న గొడవను మాత్రం ఆపలేకపోయారు. ఇక మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అసలు ఈ గొడవ ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుంది అన్న విషయంపై ఇంకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. అయితే ఈ వివాదం ఇంత పెద్దదైనప్పటికీ ఇండస్ట్రీలోని ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఎందుకు కల్పించుకోలేదు? అనే ప్రశ్న ఇంకా సస్పెన్స్ గానే ఉంది. తాజాగా ఈ ప్రశ్నకి మంచు విష్ణు సమాధానం చెప్పారు.
మంచు వివాదంపై ఇండస్ట్రీ పెద్దల సైలెన్స్
మంచు మోహన్ బాబు – మనోజ్ ల మధ్య ఇంత పెద్ద గొడవ జరిగినా ఒక్క స్టార్ హీరో కూడా నోరు తెరవలేదు. ఇండస్ట్రీలో బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna), చిరంజీవి (Chiranjeevi) వంటి దిగ్గజ నటీనటులు ఉన్నారు. సాధారణంగా ఏ గొడవ వచ్చినా సరే చిరంజీవి దానిపై స్పందిస్తారు. అయితే చిరంజీవి – మోహన్ బాబు మధ్య ఉన్న గొడవల కారణంగా ఆయన స్పందించలేదు అనుకున్నప్పటికీ… బాలయ్యకు – మోహన్ బాబు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. కానీ ఆయన కూడా ఇప్పటిదాకా ఈ వివాదంపై ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు.
తాజాగా ఇంటర్వ్యూలో మంచు విష్ణుకు ఇదే ప్రశ్న ఎదురైంది. “ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు మోహన్ బాబు నిలబడతారు. అలాంటిది మోహన్ బాబుకి సమస్య వస్తే, ఇంత జరుగుతున్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నాగ్, బాలయ్య, చిరు వంటి పెద్దలు ఎందుకు మాట్లాడలేదు, ఈ వివాదానికి ఎందుకు బ్రేకులు వేయలేదు?” అనే ప్రశ్నకు స్పందిస్తూ… “ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నా ఫ్యామిలీ. ఇంటి గొడవ బయటకు వచ్చిందని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారు. కానీ బహిరంగంగా ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ గొడవ ఎంత త్వరగా చల్లబడితే అంత మంచిది అన్న ఉద్దేశంతోనే మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు ఇళ్ళలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కానీ ఇది అన్ ఫార్చునేట్ గా బయటకు వచ్చింది. ఈరోజుకి ఈ విషయంలో నాన్నగారి మనసు విరిగిపోయింది. అందరూ మాట్లాడలేదు… కానీ దీనిపై మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు. మన అనుకున్న వాళ్లు మాట్లాడారు. ఇండస్ట్రీకి పెద్దగా నాన్నగారు ఉండి, మిగతా గొడవలన్నీ ఆపే ఆయన ఇంట్లో గొడవ అయినప్పుడు ఒక 50% జనానికి ఎలా రియాక్ట్ కావాలో తెలియదు. మిగతా 50% సైలెంట్ గా దీన్ని క్లోజ్ చేద్దామని అనుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
రెండు కొప్పుల మధ్య గొడవా?
ఇక ఇదే ఇంటర్వ్యూలో “మనోజ్ – మౌనికను పెళ్లి చేసుకున్నాకే గొడవలు మొదలయ్యాయి అంటున్నారు. రెండు కొప్పులు ఒకే చోట ఇమడ లేదా?” అనే ప్రశ్నకు మంచు విష్ణు “నేను దీనికి ఆన్సర్ చెప్పను” అని తప్పించుకున్నారు.