Nagarjuna About ANR Biopic: బయోపిక్స్ అనేవాటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బయోపిక్స్ తెరకెక్కిస్తే అవి మినిమమ్ గ్యారెంటీ హిట్లు అని మేకర్స్ కూడా భావిస్తూ ఉంటారు. అందుకే చాలావరకు బాలీవుడ్ మేకర్స్ అంతా బయోపిక్స్ పైనే ఆధారపడుతుంటారు. అలాగే తెలుగులో తెరకెక్కిన బయోపిక్స్ కూడా చాలావరకు పరవాలేదనిపించాయి. ‘మహానటి’ లాంటి బయోపిక్స్ ద్వారా సినీ సెలబ్రిటీల జీవితకథలనే చిత్రాలుగా తెరకెక్కిస్తే అవి వర్కవుట్ అవుతాయని చాలామంది ప్రేక్షకులకు అనిపించింది. అందుకే నాగార్జునకు తరచుగా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. తన తండ్రి ఏఎన్ఆర్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు అని. తాజాగా ఈ ప్రశ్నకు ఆయన ముక్కుసూటిగా సమాధానమిచ్చారు.
అలాంటి ఉద్దేశ్యం లేదు
ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు అంతా గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్‌కు బయల్దేరారు. అక్కడ జరుగుతున్న ఈవెంట్‌లో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇటీవల నాగార్జున (Nagarjuna) కూడా తన భార్య అమలతో పాటు నాగచైతన్య, శోభితాతో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడ మరోసారి ఏఎన్ఆర్ బయోపిక్ గురించి ఆయన ఆలోచన ఏంటని నాగ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. దానికి ఆసక్తికర సమాధానమిచ్చారు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే ఏఎన్ఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే ఉద్దేశ్యం తనకు లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అదే విషయాన్ని మరోసారి ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తండ్రి జీవితంలో ఎత్తుపల్లాలు లేవని మొదలుపెట్టారు.
Also Read: శోభితాతో చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను.. మొదటిసారి భార్య గురించి నోరువిప్పిన చైతన్య
డాల్బీ స్టూడియో
ఏఎన్ఆర్ జీవితంలో ఎత్తుపల్లాలు లేవని, ఎప్పుడూ ఆయన కెరీర్‌లో హై రేంజ్‌లోనే ఉన్నారని, అలాంటి వ్యక్తి జీవితాన్ని బయోపిక్‌గా తీస్తే బోరింగ్‌గా ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు నాగార్జున. ఇక ఏఎన్ఆర్ గురించి ప్రస్తావన రావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ గురించి, అక్కడ వారు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల గురించి బయటపెట్టారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే అంతర్జాతీయ సౌకర్యాలతో డాల్బీ స్టూడియోస్ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఇండియాలో అలాంటి స్టూడియో లేకపోవడం వల్లే రాజమౌళి లాంటి దర్శకులు బయట దేశాలకు వెళ్లి షూటింగ్ చేసేవారని గుర్తుచేసుకున్నారు నాగ్. అంతే కాకుండా తన అప్‌కమింగ్ సినిమాల గురించి కూడా ఆయన ఈ ఈవెంట్‌లో మాట్లాడారు.
బెస్ట్ డైరెక్టర్
లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ (Coolie)లో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజ్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్‌లో లోకేశ్ కనకరాజ్‌తో కలిసి పనిచేయడంపై నాగార్జున స్పందించారు. తను ఈతరం దర్శకుల్లో బెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తనతో పనిచేయడం చాలా ఫ్రీగా అనిపిస్తుందని, నటీనటులకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున ‘కూలీ’తో పాటు ‘కుబేర’ (Kubera)లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోగా కాకుండా కీలక పాత్రలతోనే అలరించడానికి సిద్దమయ్యారు నాగ్.