Hit 3: ఈరోజుల్లో చాలావరకు హీరోలంతా తమ కంఫర్ట్ జోన్‌ను దాటి సినిమాలు చేయడానికే ఇష్టపడుతున్నారు. కొత్త కథలను ఎంచుకుంటే ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకంతో ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో అతిపెద్ద రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నాడు నాని. నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని.. ఇప్పటివరకు ఎక్కువగా పక్కింటబ్బాయి పాత్రల్లోనే కనిపించాడు. అలాంటిది మొదటిసారి పూర్తిగా వైలెంట్‌గా మారిపోయి సినిమాలు చేస్తున్నాడు. అందులో ముందుగా నాని వైలెంట్ అవతార్‌లో ‘హిట్ 3’ సినిమాలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా స్టోరీకి సంబంధించి మేజర్ లీక్ ఇచ్చేశాడు నాని.
నిర్మాతగా హిట్లు
నేచురల్ స్టార్ నాని హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్‌ఫుల్. అలా తను నిర్మాతగా మారి పరిచయం చేసిన దర్శకులంతా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. అలాంటి దర్శకుల్లో శైలేష్ కొలను ఒకడు. ‘హిట్’ అనే సినిమాతో శైలేష్ కొలనును దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాని. అందులో తను హీరోగా నటించకుండా కేవలం నిర్మాతగానే పరిమితమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో దీనిని ఒక యూనివర్స్‌లాగా చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చాడు శైలేష్. అలా ఈ ఫ్రాంచైజ్ మొదలయ్యింది. ఇప్పటివరకు హిట్‌వర్స్ నుండి వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లే.
వాటితో పోలిక
హిట్‌వర్స్ హిట్ అవ్వడంతో నిర్మాతగా ఉన్న నాని హీరోగా కూడా మారాడు. ‘హిట్ 3’లో అర్జున్ సర్కార్ అనే వైలెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. ఇప్పటివరకు నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. అది కూడా ఒకేసారి ఇంత వైలెంట్ పోలీస్ ఆఫీసర్ అంటే ప్రేక్షకులకు నమ్మడానికి కాస్త సమయం పట్టింది. కానీ మూవీ టీమ్ మాత్రం ‘హిట్ 3’ కూడా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నాని సైతం తను ఇలాంటి కొత్త పాత్రలో నటించినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ‘హిట్ 3’ గురించి మాట్లాడిన నాని.. ఈ సినిమా స్టోరీని లీక్ చేసేశాడు. ఈ ఫ్రాంచైజ్‌లోని మునుపటి సినిమాలతో ‘హిట్ 3’ (Hit 3)ను పోల్చాడు.
Also Read: కథలో వేలు పెట్టి.. సినిమాను నాశనం చేస్తున్నారు.. బాలీవుడ్ పరిస్థితి ఇది అంటున్న హీరో
అలా ఉండదు
‘‘నా కెరీర్‌లోనే నేను నటించిన ఊరమాస్ సినిమా ఇది. ఇందులో ఉండే వైలెంట్ యాక్షన్ చూసి ప్రేక్షకులు షాకవుతారు. ఇది హిట్ 1, హిట్ 2లాగా అస్సలు ఉండదు. ఆ సినిమాలు ఎవరు క్రైమ్ చేశారు అనేదానిపై ఫోకస్ అయ్యి ఉంటాయి. హిట్ 3 మాత్రం ఎలా క్రైమ్ చేశారు అనేదానిపై ఫోకస్ అయ్యి ఉంటుంది’’ అని రివీల్ చేశాడు నాని (Nani). అంటే మునుపటి సినిమాల్లాగా ఇందులో విలన్ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండకపోయినా.. హత్యలు, వాటిని చూపించే తీరుతోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పకనే చెప్పాడు నాని. దీంతో ప్రేక్షకుల్లో హైప్ మరింత పెరిగిపోయింది. మే 1న ‘హిట్ 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది.