Niaharika NM: ఇప్పటివరకు గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాలను నిర్మించిన బన్నీ వాస్.. ఈ మధ్యనే BV వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్ ను ప్రకటించాడు. తాజాగా ఈ బ్యానర్ లో మిత్ర మండలి అనే సినిమాను అనౌన్స్ చేశాడు బన్నీ వాస్. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే నటీనటుల ఫేసెస్ రివీల్ చేయకుండా టైటిల్ ను ప్రకటించి.. ఆ నటులు ఎవరో గెస్ చేయమని మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా మిత్రమండలి సభ్యులను మేకర్స్ రివీల్ చేశారు. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి మంచి మంచి కథలను ఎంచుకుంటూ హీరోగా ఎదిగాడు ప్రియదర్శి. ఇక ఈ ఏడాది కోర్ట్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో.. ఆతరువాత సారంగపాణి జాతకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా ప్రియదర్శికి వరుస ఛాన్స్ లు తలుపుతడుతున్నాయి.
మిత్రమండలి సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. అతనితో పాటు సినిమా బండి ఫేమ్ రాగ్ మయూర్, మ్యాడ్ సినిమాతో బాగా పాపులర్ అయిన విష్ణు, యూట్యూబ్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గా ఇంటర్నేషనల్ గుర్తింపును సంపాదించుకున్న నిహారిక NM ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. నిహారిక గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. పెద్ద పెద్ద సినిమాలను ప్రమోట్ కూడా చేసింది.
మహేష్ బాబు నిర్మించిన మేజర్ ప్రమోషన్స్ లో నిహారిక కనిపించింది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీని తరువాత వరుస సినిమా ప్రమోషన్స్ తో పేరు తెచ్చుకున్న నిహారిక.. సినిమాల్లో ఛాన్స్ లు పట్టేసింది. తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా అమ్మడు మొదట పరిచయం కానుంది. ఇప్పటికే ఈ చిన్నది కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది రిలీజ్ అయిన పెరుసు సినిమాతో నిహారిక ఎంట్రీ ఇచ్చింది. వైభవ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత నిహారికకు వరుస ఛాన్స్ లు అందుకుంటూ వస్తుంది.
తమిళ్ లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు మిత్రమండలి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. అందులో బన్నీ వాస్ బ్యానర్ లో ఈ చిన్నది ఎంట్రీ ఇస్తుంది అంటే లక్కీ ఛాన్స్ పట్టేసినట్లే అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మిత్రమండలి హిట్ అయ్యి నిహారికకు గుర్తింపు వచ్చింది అంటే తెలుగులో నిహారిక శకం మొదలైనట్లే. మంచి నటన కనపరిచే నిహారిక తెలుగులో స్టార్ హీరోయిన్ ను దక్కించుకుంటుందో లేదో చూడాలి.