Nidhhi Agerwal: టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్న చాలామంది హీరోయిన్స్.. ముందుగా తెలుగులో డెబ్యూ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. కానీ చాలా తక్కువమంది నటీమణులు మాత్రమే బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ ఒకరు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నిధి.. ‘మున్నా మైఖెల్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది నిధి.
ఎప్పుడు విడుదల అవుతాయో
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుండి ఒక్క స్టార్ హీరోతో కూడా నటించలేదు. చాలావరకు యంగ్ హీరోలతోనే నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు కొనసాగించింది. అలాంటి తనకు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’లో ఒకేసారి అవకాశాలు దక్కాయి. దీంతో నిధి అగర్వాల్ లైఫ్ మారిపోతుందని అనుకున్నారంతా. కానీ ఈ రెండు సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అసలు చెప్పిన తేదీకి విడుదల అవుతాయా లేదా అనేది కూడా డౌటే. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవం ఎలా ఉందో అందరితో పంచుకుంది నిధి అగర్వాల్.
అందుకే ఒప్పుకున్నాను
పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం తాను గుర్రపు స్వారీ, కథక్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). పవన్ కళ్యాణ్‌తో నటించే కల నిజం కావడంతో తాను చాలా అదృష్టవంతురాలిగా ఫీల్ అయ్యానని తెలిపింది. ఇప్పటివరకు తను ఇలాంటి పాత్రలో నటించలేదని సంతోషం వ్యక్తం చేసింది. తనకు హారర్ సినిమాలంటే భయమని, అందుకే ఆ భయం పోవడం కోసం ‘రాజా సాబ్’ చేయడానికి ఒప్పుకున్నానని గుర్తుచేసుకుంది. ఈ సినిమా సెట్‌లో స్క్రిప్ట్ చదుతున్నప్పుడు కూడా అందరూ నవ్వుతూనే ఉంటారని బయటపెట్టింది. అంతే కాకుండా సెట్‌లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎలా ఉంటారో చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
Also Read: ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు మేము కూడా చేయగలం.. మలయాళ నటుడి హాట్ కామెంట్స్
ఎంతో ప్రోత్సహించారు
సెట్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas) ఇద్దరూ తనను ఎంతగానో ప్రోత్సహించారు అని తెలిపింది నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ సెట్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారని చెప్పుకొచ్చింది. యాక్షన్ అని చెప్పగానే పూర్తిగా తన పాత్రలోకి వెళ్లిపోతారని, చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరని చెప్పింది. కేవలం ఆ సీన్‌పైనే ఆయన ఫోకస్ మొత్తం ఉంటుందని, ఆ లక్షణాన్ని తను కూడా అలవాటు చేసుకోవాలనంది నిధి అగర్వాల్. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. తనొక ఫన్నీ పర్సన్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఫ్యాన్స్‌తో పాటు తాను కూడా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘రాజా సాబ్’ (Raja Saab) సినిమాలు ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఎదురుచూస్తున్నట్టు చెప్పింది నిధి.