Nivin Pauly : ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలి (Nivin Pauly) లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. దాన్ని చూస్తే సినిమాలో క్లైమాక్స్ గుర్తు రావడం ఖాయం. ఇంతకీ నీవిన్ పావని లైంగిక వేధింపుల కేసు ఎండింగ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
మలయాళ చిత్ర పరిశ్రమను హేమ కమిటీ నివేదిక కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక బహిర్గతం అయ్యాక చాలామంది చీకటి చిట్టాలు బయట పడ్డాయి. అందులో భాగంగా ఇండస్ట్రీలో జరిగిన ఎన్నో అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే సినీ పెద్దలమని చెప్పుకునే ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో, వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ‘ప్రేమమ్’ (Premam) మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలి (Nivin Pauly)పై అనూహ్యంగా లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించాయి.
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఓ నటి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసింది సదరు యువతి. దీంతో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు నివిన్ పౌలి (Nivin Pauly)తో సహా ఆరుగురిపై కేసును నమోదు చేశారు పోలీసులు. అయితే తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే నివిన్ పౌలి అవన్నీ అసత్య ఆరోపణలని, కావాలనే తనపై కుట్ర పన్నుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ విషయంలో తను న్యాయ పరంగా పోరాడతాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ విసిశారు నివిన్ పౌలి.
ఈ నేపథ్యంలోనే నివిన్ పౌలి (Nivin Pauly)కేసులో పోలీస్ విచారణ తాజాగా చివరకు వచ్చేసింది.. విచారణ జరిపిన పోలీసులు నటుడు నివిన్ పౌలి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చడం షాకింగ్ విషయం. ఈ కేసులో పోలీసులు ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వడంతో అభిమానులు సంతోష పెడుతున్నారు. కానీ మంచి ఇమేజ్ ఉన్న నటుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు కొంతమంది. అయితే యువతీ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన జరిగిన టైంలో నివిన్ పౌలి అసలు అక్కడ లేనట్టు గుర్తించారు. అలాగే అమ్మాయి చేసిన వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లభించలేదంటూ పోలీసులు కొత్త మంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న నివిన్ పౌలి పేరును తొలగించారు. అయితే మిగిలిన నిందితుల హస్తం ఉందా లేదా అనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
నిజానికి నివిన్ పౌలి (Nivin Pauly) ఫ్యాన్స్ ఈ విషయంలో ఏం జరిగిందో తేలేదాకా ఆయనకు మౌనంగానే సపోర్ట్ చేశారు. అయితే ఓ వర్గం మాత్రం హేమ కమిటీ నివేదిక సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు యువతికి సపోర్ట్ చేశారు. తీరా ఇప్పుడు ఏం లేదని తేలడం వాళ్ళకు షాకింగ్ విషయమే మరి.