Nandamuri Balakrishna: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందించి గౌరవించనుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రంగంలో విశేష సేవలు అందించిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలియగానే నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారకరామారావు నట వారసుడిగా బాలకృష్ణ.. తాతమ్మ కల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా తండ్రి సినిమాల్లో నటిస్తూ పెరిగిన బాలయ్య.. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తరువాత బాలయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సినిమా అంటే బాలయ్యకు ఎంతో ప్రాణం. ఆ సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఇండస్ట్రీలో ఆయన చేయని పాత్ర లేదు.. ఆయన చేయని ప్రయోగం లేదు. జననీ జన్మభూమి, మంగమ్మగారి మనవడు, అపూర్వ సహోదరుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య,ఆదిత్య 369, భైరవ ద్వీపం, నరసింహానాయుడు.. ఇలా ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు. ఇప్పటివరకు 109 సినిమాల్లో నటించి మెప్పించిన బాలయ్యకు రాని అవార్డ్స్ లేవు.
Padma Awards 2025 : హీరో అజిత్, నటి శోభన, బాలీవుడ్ శేఖర్ కపూర్ కు పద్మ భూషణ్
1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న బాలయ్య.. నరసింహ నాయుడు , సింహా,లెజెండ్ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులను అందుకున్నాడు. ఇక ఇవి కాకుండా 2007 లో అక్కినేని అభినయ పురస్కారం, పాండు రంగడు, సింహా,శ్రీరామా రాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డును కైవసం చేసుకున్నాడు.
ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుకున్నాడు బాలయ్య. 2014 శాసనసభ ఏన్నికలలో మొదటి సారి ఎన్నిక అయ్యాడు. ఆ తరువాత 2019లో.. ఇక గతేడాది జరిగిన 2024 ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకొని తన సత్తా చూపించాడు. ఇక సినిమాలు, రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే.. బాలయ్య సేవ మరో ఎత్తు.
బాలయ్యకు ఉన్న కోపం చూసి అందరూ భయపడతారు కానీ, ఆయనకు దగ్గరగా ఉన్నవారే బాలయ్య మనసు గురించి చెప్తారు. బాలయ్య మనసు వెన్న. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించి ఎంతోమంది క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. కేవలం ఇదొక్కటే కాకుండా ఎన్నో సేవలు ప్రజలకు అందించాడు.
సినిమాల పరంగా ఇప్పటివరకు ఫేక్ కలక్షన్స్ లేని ట్రాక్ రికార్డ్ బాలయ్యది. అభిమానులతో కలిసి కూర్చొని తినడం ఆయనకు ఎంతో ఇష్టం. నందమూరి బాలకృష్ణకు వసుంధరా దేవితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి.. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ భార్య. రెండో కుమార్తె తేజస్విని. కొడుకు మోక్షజ్ఞ తేజ్. త్వరలోనే మోక్షు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
64 ఏళ్ళ వయస్సు.. 50 ఏళ్ళ సీనిప్రస్థానం.. 109 సినిమాలు.. కళా రంగంలో బాలయ్య ఒక లెజెండ్. తండ్రి పేరును నిలబెట్టిన వంశోద్ధారకుడు. ఇక ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బాలయ్య సేవలను మెచ్చి నేడు కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ తో సత్కరించింది. ఇది నందమూరి కుటుంబానికి మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కు మరువలేని మూమెంట్ అని చెప్పొచ్చు.