Pawan Kalyan: సినిమాల్లో పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నా కూడా రాజకీయాల్లో రాణించాలి అనేది పవన్ కళ్యాణ్ కల. ఒకసారి రాజకీయాల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత కూడా వెనకడుగు వేయకుండా మళ్లీ పోరాడారు. అలా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు పవన్. ప్రస్తుతం సినిమాలకు చాలావరకు దూరంగా ఉంటూ రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. రాజకీయ నాయకుడిగా పవన్ కల నెరవేరినందుకు తన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. కానీ వెండితెరపై మళ్లీ తనను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూడడం మాత్రం ఆపలేదు. అందుకే తాజాగా సందర్భం లేకుండా ఓజీ అంటూ అరిచి మరోసారి పవన్ చేత తిట్లు తిన్నారు ఫ్యాన్స్.
సీరియస్ అయ్యారు
రాజకీయాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనాల్సి ఉంటుంది, మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది. చాలావరకు ఈ సభలు ఓపెన్ ఏరియాల్లోనే జరుగుతాయి కాబట్టి వాటిని చూడడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా తరలివస్తారు. పవన్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో పట్టించుకోకుండా ‘ఓజీ’ అని, ‘హరి హర వీరమల్లు’ అని అరుస్తూ ఉంటారు. ఇలా పలుమార్లు జరగడంతో పవన్ కళ్యాణ్‌కు కోపం వచ్చి ఫ్యాన్స్‌పై సీరియస్ అయ్యారు. తాజాగా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును కలవడానికి వారి నివాసానికి వెళ్లారు పవన్. అక్కడ కూడా ఫ్యాన్స్ ‘ఓజీ’ అని అరవడంతో వారిపై మరోసారి సీరియస్ అయ్యారు పవర్ స్టార్.
Also Read: వీళ్లు నా సినిమాలకు పనికిరారు… స్టార్ డైరెక్టర్ కాంట్రోవర్సియల్ కామెంట్స్
మీతో ఎలా అయ్యా!
ఇటీవల గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఆయనను పరమర్శించడానికి ఆయన నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. పవన్ వస్తున్నాడని తెలియగానే తన ఫ్యాన్స్ అంతా అక్కడికి చేరుకున్నారు. వారు సైలెంట్‌గా ఉండకుండా ‘ఓజీ.. ఓజీ.. ఓజీ..’ అంటూ అరవడం మొదలుపెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు మరోసారి తన అభిమానులపై కోపం వచ్చింది. ‘‘మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో తెలియకపోతే ఎలా అయ్యా!’’ అని సైలెంట్ అయిపోయారు. దీంతో ఫ్యాన్స్‌కు మరొకసారి పవన్ కళ్యాణ్ దగ్గర చురక తగిలింది అంటూ ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయినా కూడా ఫ్యాన్స్ తమ తీరు మార్చడం లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీసారి ఇంతే
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు తను అర్థాంతరంగా వదిలేసిన సినిమాలను పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఇటీవల కొన్నాళ్ల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ రెండు షెడ్యూల్స్‌ను కవర్ చేశారు. అలా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌ను సినిమాలతో సంతోషపెట్టాలని కష్టపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం తను రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో కూడా సినిమాల అప్డేట్స్ అడుగుతూ విసిగిస్తున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు. అందుకే తన ఫ్యాన్స్‌పై పవన్ కోప్పడడం తప్పేమీ కాదని సపోర్ట్ చేస్తున్నారు.