Hari Hara VeeraMallu : మొత్తానికి హరి హర వీరమల్లు షూటింగ్ అయిపోయింది. పవన్ చేయాల్సిన పార్ట్ మొత్తాన్ని రెండు రోజుల్లో కానించి.. గుమ్మడికాయ కొట్టేశారు. హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ వరకు అయితే ఇప్పుడు పూర్తి అయింది. ఇక సెకండ్ పార్ట్ సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి అయినే హ్యాపీనెస్ పవన్ ఫ్యాన్స్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఓ దిగులు కూడా ఉంది. అదే… మూడు కర్రలతో కొట్టిన ఆ పాము చచ్చిందా…? లేదా…?
పెద్దలు చెప్పిన ఓ సామేత ఉండేది. ‘పది మందిలో పాము చావదు’ అని. అంటే… ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే జరగాల్సిన పని జరగదు అని దాని అర్థం. ఇప్పుడు హరి హర వీరమల్లు విషయంలో కూడా అదే జరిగింది.
మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. క్రిష్ దాదాపు 80 శాతం వరకు షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయించడం, అదే టైంలో ఆంధ్ర ప్రదేశ్ లో జనరల్ ఎలక్షన్స్ రావడం, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కూటమి అధికారంలోకి రావడం, ఆయనకు పలు కీలక మంత్రి పదవులతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రావడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.
పవన్ కోసం వెయిట్ చేసి.. చేసి.. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తప్పుకున్నాడా..? లేక నిర్మాతలు తప్పించారా అనేది చాలా మందిలో ఒక డౌట్ అయితే అలాగే ఉంది. ఏది ఏమైనా… 80 శాతం పూర్తి చేసిన తర్వాత క్రిష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
క్రిష్ తర్వాత హరి హర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు నిర్మాత ఎఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఆక్సిజన్, రూల్స్ రంజన్ లాంటి డిజాస్టర్లను తెలుగు ఇండస్ట్రీకి అందించిన అనుభవం ఈయనకు ఉంది. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో అవసరం లేని కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పార్ట్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు.
ఫైనల్ గా పవన్ కళ్యాణ్ టైం ఇచ్చాడు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. నిన్నటితో షూటింగ్ పూర్తి అయిపోయింది. గుమ్మడికా కూడా కొట్టారు.
అయితే ఇప్పటి వరకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం చూస్తున్నారు. కానీ, ఈ చివరి రెండు రోజుల కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. ఈ రెండు రోజుల పాటు షూటింగ్ ను పరిశీలించి, జ్యోతికృష్ణకు కావాల్సిన సూచనలు కూడా ఇచ్చారట. నిజానికి పవన్ కళ్యాణ్ చేసే సినిమాలకు త్రివిక్రమ్ పర్యవేక్షణ అనేది కంపల్సరీ. అయితే.. ఈ హరి హర వీరమల్లుకు మాత్రం అది జరగలేదు. అప్పట్లో త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ టెన్షన్ లో ఉన్నాడు. కథ ఛేంజ్ చేయడం, కొంత వరకు షూటింగ్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయడం లాంటివి గుంటూరు కారం టైంలో జరిగాయి. అందువల్ల హరి హర వీరమల్లుపై అప్పుడు గురూజీ ఫోకస్ చేయలేదు. ఇప్పుడు హరి హర వీరమల్లును పూర్తి చేసి, రిలీజ్ చేసేలా.. గురూజీ కూడా అడుగులు వేస్తున్నాడు.
షూటింగ్ పూర్తి కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా గురూజీ పర్యవేక్షణలోనే జరుగుతాయని తెలుస్తుంది. ఇలా… హరి హర వీరమల్లు సినిమా కోసం ఇప్పటి వరకు ముగ్గురు డైరెక్టర్లు పని చేశారు. ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ కు కలవరపెడుతుంది. ఒక్క డైరెక్టర్ చేసిన మూవీనే వర్కౌట్ అవ్వడం లేదు. ఇలా ముగ్గురు వేలు పెట్టి సినిమాను ఏం చేశారు అని అనుకుంటున్నారు.