Pawan Kalyan: రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరంగా ప్రసంగించారు. సినిమా మీద, సినీ పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఇవాళ పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఇంకెవరు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారే అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని అన్నారు. ఇవాళ మీరు కల్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి…. అన్నింటికీ ఆద్యుడు మెగస్టార్ చిరంజీవే అని చెప్పుకొచ్చారు. తాను ఎన్నడూ.. మూలాలను మరచిపోలేదని అన్నారు. ఎంతోమందితో కూడిన తెలుగు చిత్రపరిశ్రమ కదిలి వచ్చిందంటే అందుకు స్ఫూర్తి అక్కినేని గారు, ఎన్టీఆర్ గారు, ఘట్టమనేని కృష్ణ గారు, శోభన్ బాబు గారు. ఇలా తె లుగు చిత్ర పరిశ్రమ కోసం సర్వశక్తులు ధారపోసిన మహానుభావులందరికీ ఒక నటుడిగానే కాదు, ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
తనకు ఓజీ ముఖ్యం కాదని.. ప్రేక్షకుల భవిష్యత్తే ముఖ్యమని పవన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని చెప్పారు. చిత్రపరిశ్రమకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధే మన నినాదమని తెలిపారు. ‘‘నేను అయినా.. రామ్‌చరణ్ అయినా చిరంజీవి తర్వాతే’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవాళ ఇంత పెద్ద ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటున్నామంటే… కూటమి ప్రభుత్వ పెద్ద, ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు, ఆయన సహకారం, ఆయన నిరంతర మద్దతు వల్లే అని అన్నారు. ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని చెప్పారు. హోంమంత్రి అనిత, రాష్ట్ర డీజీపీకి, జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, ఇతర జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.