Pushpa 2 : “పుష్ప 2 ” మూవీ రిలీజ్ అయ్యింది అన్న గుడ్ న్యూస్ తో పాటు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద విషాదకర సంఘటన జరిగిందన్న బ్యాడ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఎంతో ఆశగా సినిమాని చూడడానికి వచ్చిన ఓ ఫ్యామిలీకి ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ జీవితంలో కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రతిష్టాత్మక సినిమా ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు ప్రీవియర్స్ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఏ క్రమంలోనే డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో అభిమానులకు అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఇచ్చారు. నిజానికి ప్రీమియర్ షోలను సంధ్య థియేటర్ లో చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వాళ్లతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అభిమానులు ఎక్కువ సంఖ్యలో థియేటర్ వద్దకు రావడంతో తోపులాట జరిగింది. వాళ్లను నిలవరించడానికి పోలీసులు ఏకంగా లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడగా, ఓ ఫ్యామిలీకి ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. దిల్‌సుఖ్‌నగర్ కు చెందిన రేవతి తన భర్త భాస్కర్ తో పాటు ఇద్దరు పిల్లలు తేజ్, శాన్వి తో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లారు. కానీ అక్కడ ఊహించని విధంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తొక్కిసలాటలో రేవతితో పాటు ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. థియేటర్ దగ్గరే రేవతి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను దగ్గరలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ (Durgabai Deshmukh) ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ ఘటనలో తల్లి మరణించగా కొడుకు తేజ్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ హృదయ విదారకర సంఘటన అందరి మనసులను కలచివేసింది. ఈ ఫ్యామిలీకి అల్లు అర్జున్ అండగా నిలవాలని కోరుతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఘటనపై కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. తొక్కిసలాటకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే చాలామంది అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్ (Allu Arjun) థియేటర్ కి రావడం వల్లే ఇలా జరిగిందని మండిపడుతున్నారు. కానీ అల్లు అభిమానులు మాత్రం ఇది థియేటర్ యాజమాన్యం తప్పిదం అంటున్నారు. మరి విచారణలో పోలీసులు ఏం తేలుస్తారు అనేది చూడాలి. మరోవైపు ఈ విషయం పై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదు. మరి అభిమానులు కోరుతున్నట్టుగా ఆయన బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.