Vijay Thalapathy : తమిళ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) శుక్రవారం చెన్నైలో ఇఫ్తార్ విందు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన ముస్లింలను అవమానించారని తమిళనాడు సున్నత్ జమాత్ అనే ముస్లిం సంఘం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.
విజయ్ పై కేసు నమోదు
దళపతి విజయ్ తమిళగ వెట్రి కగజం (TVK) అనే పార్టీని పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం చెన్నైలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ఉపవాసం విరమించే ముందు జరిగిన ప్రార్థనలో పాల్గొన్న విజయ్, అనంతరం విందు కార్యక్రమాల్లో కూడా సందడి చేశారు. ఈ ఇఫ్తార్ విందు సక్సెస్ ఫుల్ గా జరగడంతో విజయ్ సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. కానీ కొంతమంది ముస్లిం పెద్దలు మాత్రం విజయ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ పై తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ ఈ మేరకు ముస్లింల మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ఫైర్ అవుతూ, కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ లో “విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లింలను అవమానించారు. ఎందుకంటే ఉపవాసం లేదా ఇఫ్తార్ తో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇది కచ్చితంగా ముస్లింలను అవమానించడమేనని మేము నమ్ముతున్నాము. ఈ వేడుకను బాధాకరమైన రీతిలో నిర్వహించారని దీన్ని బట్టి చెప్పొచ్చు. అయితే ఇఫ్తార్ విందు ఎలా జరిగింది అనే విషయాన్ని విజయ్ విచారించలేదు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సరిగ్గా చేయలేదు. విదేశీ గార్డులు ముస్లింలను అగౌరవపరిచారు. వారిని ఆవుల్లాగా చూసారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి విజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము పబ్లిసిటీ కోసం ఈ కంప్లైంట్ చెయ్యట్లేదు” అంటూ ఆయన విజయ్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు.
శుక్రవారం రాయపేట వైఎంసిఏ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందును విజయ్ నిర్వహించారు. ఉపవాసం విరమించే ముందు ప్రార్థనలో పాల్గొన్న ఆయన, స్కల్ క్యాప్ ధరించి వేడుకలకు హాజరయ్యారు. అలాగే ఈ వేడుకకు హాజరైన వారితో కలిసి విందు భోజనం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
విజయ్ సినిమాలు, రాజకీయాలు
2024లో విజయ్ ‘ది గోట్’ అనే సినిమాతో తన అభిమానులను చివరిసారిగా పలకరించారు. వెంకట్ ప్రభు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక చివరిగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జననాయగన్’ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్. ఈ మూవీలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబి డియోల్ తదితరులు నటిస్తున్నారు. 2026లో జరగబోయే ఎన్నికల ముందు ఇదే ఆయన చివరి సినిమా అవుతుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ తాను ఇకపై ఎలాంటి సినిమాలకు సైన్ చేయనని కన్ఫర్మ్ చేశారు. గత సంవత్సరమే విజయ్ తన పార్టీ టీవీకేను అనౌన్స్ చేశారు.