lokSabha: పార్లమెంట్ సమావేశాలు వాడి వేడీగా సాగుతున్నాయి. పాలక పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ సమస్యలపై సభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూసర్వేను రద్దు చేసి, టెక్నాలజీ సాయంతో కొత్తగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీ సమస్యలపై మాట్లాడారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున భూకబ్జాలు, పబ్లిక్ వనరుల దోపిడీ ప్లాన్ ప్రకారం జరిగిందన్నారు. ఏపీలో భూములు కేవలం ప్రజల ఆస్తులు మాత్రమే కాదు, ప్రజలకు సెక్యూరిటీ, డిగ్నిటీ, లెగసీ అని చెప్పారు. వైసీపీ హయాంలో ఈ సెంటిమెంట్‌ను ఉల్లంఘించారని వివరించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించినట్టు సభ దృష్టికి తెచ్చారు. నాలుగు నెలల వ్యవధి లో రెండు లక్షల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు. భూముల సర్వే కోసం కేంద్ర ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చెప్పుకొచ్చారు.
భూముల సర్వేను ఒక ఆయుధంగా చేసుకుని వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో 40 వేల అస్సైన్డ్ భూములను తక్కువ ధరకు అమ్ముకున్నారని తెలిపారు. జీవో 596 తెచ్చి అస్సైన్డ్ భూములను తనకు కావలసిన వారి పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ. 14,831 కోట్లు నష్టం జరిగిందన్నారు.
ALSO READ: రాజధానిపై కీలక ప్రకటన
భూముల సర్వే చేసిన తర్వాత రూ. 700 కోట్లతో పునాది రాళ్లు వేసి, ఆపై ముఖ్యమంత్రి బొమ్మ పెట్టారని తెలియజేశారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ. 300 కోట్లు దుర్వినియోగం చేశారని, ఇందుకు అనుకూలంగా ఉన్న అధికారులను నియమించి ఆక్రమణలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన సర్వేను రద్దు చేసి, తాజాగా టెక్నాలజీ సాయంతో సర్వేకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందుకోసం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.