Mahesh Babu : విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’ (Chhaava) బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘ఉరి : ది సర్జికల్ స్ట్రైక్’ మూవీ తర్వాత విక్కీ కౌశల్ ‘ఛావా’ సినిమాకు మరోసారి జాతీయ అవార్డును గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘ఛావా’ మూవీని రిజెక్ట్ చేశారని పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ అసలు నిజం ఏంటంటే ?
అన్నీ పుకార్లే !
‘ఛావా’ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ముందుగా ఈ మూవీ కోసం మహేష్ బాబును హీరోగా అనుకున్నారని టాక్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలు ఆయన కోసం వెయిట్ చేసి, మహేష్ బాబుకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో విక్కీ కౌశల్ ను హీరోగా ఎంచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది ? అనే విషయం వెల్లడైంది.
నిజం ఏంటంటే… సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలన్నీ ఫేక్. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అసలు ఒక్కసారి కూడా మహేష్ బాబుని కలవలేదు. ప్రమోషన్ ఇంటర్వ్యూలో సైతం డైరెక్టర్ లక్ష్మణ్ కు “మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు హీరోగా విక్కీ కౌశల్ కాకుండా వేరే నటులను ఎవరినైనా అనుకున్నారా?” అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు డైరెక్టర్ స్పందిస్తూ “‘ఛావా కోసం విక్కీ కౌశల్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాడు. కలలో కూడా వేరే హీరోని ఊహించలేదు. కేవలం విక్కీ కౌశల్ మాత్రమే నా హీరో” అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా “విక్కీ లాంటి హీరోతో ఏ దర్శకుడైనా మంచి సినిమాను తీయగలడు. అతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన మనిషి. నేను అతనితో సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన ఈ మూవీ తీయాలనుకున్నారు అనేది పూర్తిగా అబద్ధమని తేలిపోయింది.
200 కోట్ల క్లబ్ లోకి ‘ఛావా’
ఇక మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ జయంతి హాలిడే సందర్భంగా బుధవారం ఈ మూవీ 32 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో ‘ఛావా’ ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి చరిత్రను సృష్టించింది. బాలీవుడ్లో ఆల్ టైం టాప్ 6 సినిమాల జాబితాలోకి కూడా అడుగు పెట్టింది ఈ సినిమా. ఒకవేళ ఇదే ఊపుతో కలెక్షన్లు రాబడితే ‘ఛావా’ మరికొన్ని రోజుల్లోనే 400 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే ‘ఛావా’ విక్కి తన కెరీర్లో సోలోగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అవతరిస్తుంది.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే మహేష్ బాబు తండ్రి కృష్ణకు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వీరగాథను తెరకెక్కించాలని డ్రీమ్ ఉండేదట. మరి ఇప్పుడు మహేష్ బాబు ఆయన కలను నెరవేరుస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది.