Prithviraj Sukumaran: సినీ పరిశ్రమలో ఎంటర్ అవ్వాలనుకున్నా, ఎంటర్ అయినా ప్రతీ ఒక్కరికి ఒక కల ఉంటుంది. ఎంత స్టార్ హీరోలు అయినా కూడా కొన్నిసార్లు తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను వర్కవుట్ చేయడం కష్టం కావచ్చు. అందుకే మాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న పృథ్విరాజ్ సుకుమారన్‌కు కూడా తన కల నెరవేర్చుకోవడానికి 20 ఏళ్లు పట్టిందట. హీరోగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న పృథ్విరాజ్.. ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఒకవైపు హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు డైరెక్టర్‌గా మారాడు. ఇప్పటికే ‘లూసీఫర్’ లాంటి హిట్ మూవీని డైరెక్ట్ చేసిన తను.. ఇప్పుడు దాని సీక్వెల్ అయిన ‘ఎల్2ఈ ఎంపురాన్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పృథ్విరాజ్ సుకుమారన్.
ప్రేక్షకుల్లో ఆసక్తి
కేవలం హీరోగానే కాదు.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి ఏ మాత్రం వెనకాడడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అలాంటి తను డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నాడంటే అసలు ఆ సినిమా ఎలా ఉంటుందా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఎవరూ ఊహించని విధంగా మోహన్ లాల్‌లోని మాస్ ప్లస్ యాక్షన్ యాంగిల్‌ను చూపిస్తూ ‘లూసీఫర్’ను డైరెక్ట్ చేశాడు పృథ్విరాజ్ సుకుమారన్. ఆ సినిమా ఒక రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. ఇక ఇన్నాళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా ‘ఎల్2ఈ ఎంపురన్’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండడంతో పృథ్విరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు.
డైరెక్ట్ చేయాలనుకున్నా
‘‘20 ఏళ్ల క్రితం నేను నా కెరీర్ మొదటి రోజుల్లో ఉన్నప్పుడు నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే మోహన్ లాల్, మంజు వారియర్ ఇద్దరినీ ఒకే సినిమాలో డైరెక్ట్ చేయాలని కోరిక ఉండేది. మలయాళ సినిమాలో మోహన్‌లాల్, మమ్ముట్టి అనే ఇద్దరు స్టార్లు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించారు. ఇండస్ట్రీలో మంజు వారియర్ ఒక లెజెండ్‌లాగా పనిచేసింది’’ అంటూ అందరిపై ప్రశంసలు కురిపించాడు పృథ్విరాజ్ సుకుమారన్. ఇక మోహన్ లాల్ సైతం తన కెరీర్‌లో ఇది స్పెషల్ మూవీ అన్నట్టుగా మాట్లాడారు. మోహన్ లాల్ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా ఇంత స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఈ పాత్ర తన ఫ్యాన్స్‌కు కూడా ఫేవరెట్ అయిపోయింది.
Also Read: ‘గ్రోక్’ మావా తగ్గాడురో.. ‘సిగ్గుపడుతున్నా’.. ‘సారీ’ అంటూ పోస్ట్
ఇదొక మ్యాజిక్
‘‘ఎల్2ఈ ఎంపురన్ అనేది కేవలం సినిమా కాదు. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం. ఆ కష్టమంతా మీకు సినిమాలోనే కనిపిస్తుంది. అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది’’ అంటూ ‘ఎల్2ఈ ఎంపురాన్’ (L2E Empuraan) గురించి చెప్పుకొచ్చారు మోహన్ లాల్ (Mohanlal). మార్చి 27న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి చాలాకాలమే అయినా ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో పలు ఇబ్బందులు రావడంతో అసలు ఈ సినిమా అనుకున్న డేట్‌కు రిలీజ్ అవుతుందా అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. కానీ మొత్తానికి అన్ని అడ్డంకులు తప్పించుకొని ఈ సినిమా అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నారు మేకర్స్.