Priyadarshi: చాలావరకు సినిమాల కోసం షూట్ చేసిన సీన్స్ అన్నీ ప్రేక్షకులకు వెండితెరపై కనిపించకపోవచ్చు. అందులో చాలావరకు సీన్స్ ఎడిటింగ్‌లోనే పోతాయి. అలా ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో సీనియర్ యాక్టర్ల పాత్రలు సైతం ఇలా ఎడిటింగ్‌లో పోయాయని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికీ చాలావరకు పాన్ ఇండియా సినిమాల్లోని ఎన్నో సీన్స్ ఎడిటింగ్‌లో పోతున్నాయి. అదే విషయాన్ని మరోసారి ఒక స్టార్ కమెడియన్ కమ్ హీరో బయటపెట్టాడు. తను మరెవరో కాదు.. ప్రియదర్శి. ఇప్పటివరకు కమెడియన్‌గా ఆకట్టుకున్న ప్రియదర్శి.. ఇప్పుడు హీరోగా మారాడు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు.
ప్రియదర్శి స్పందన
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగి ఎన్నో ఏళ్లు అయిపోయింది. ఎన్నో బ్రేకులు, అడ్డంకుల తర్వాత ఫైనల్‌గా షూటింగ్ పూర్తయ్యి థియేటర్లలో విడుదలయ్యింది. విడులదయిన మొదటి రోజు నుండే ‘గేమ్ ఛేంజర్’కు మిక్స్‌డ్ టాక్ లభించింది. అయితే ఆ సినిమాలో ప్రియదర్శి కూడా ఒక చిన్న పాత్రలో కనిపించాడు. అసలు తను స్క్రీన్‌పైకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్లిపోయాడు అనేది కూడా చాలామంది ప్రేక్షకులు గమనించలేదు. అసలు అలా ఎందుకు జరిగింది అనే విషయంపై తాజాగా ప్రియదర్శి స్పందించాడు.
చాలా సీన్స్ చేశాను
‘‘బలగం కంటే ముందే నేను గేమ్ ఛేంజర్ సైన్ చేశాను. అప్పట్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తుండేవాడిని. ఇది ఆ టైమ్‌లో జరిగిన సినిమా. ఆ సినిమా విడుదల అవ్వడానికి చాలా సమయం పట్టింది. గేమ్ ఛేంజర్ ఎప్పుడు అనౌన్స్ చేశారో, షూటింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది అని కూడా ఇండస్ట్రీలో వర్గాలు అందరికీ తెలుసు. ఆ సినిమాలో నేను ఇంకా చాలా సీన్స్ చేశాను. కానీ అవన్నీ ఎడిటింగ్‌లో పోయాయి. అంతకంటే పెద్ద కారణం ఏమీ లేదు. నా పాత్ర చిన్నదని నాకు ముందే తెలుసు’’ అని ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చేశాడు ప్రియదర్శి. తనది చిన్న పాత్ర అని తెలిసి ఒప్పుకున్నా కూడా చాలావరకు తన సీన్స్ అన్నీ ఎడిటింగ్‌లోనే పోతాయని తెలిపాడు.
Also Read: వాళ్లిద్దరూ అలా ప్రవర్తించారు.. నయన్, విఘ్నేష్‌పై ధనుష్ కొత్త ఆరోపణలు
నాతో సినిమా చేయరు
‘‘నేను గేమ్ ఛేంజర్ (Game Changer) కోసం 25 రోజులు పనిచేశాను. స్క్రీన్‌పై 2 నిమిషాలు కూడా ఉండను. శంకర్‌తో, రామ్ చరణ్‌తో, తిరుతో, అంత పెద్ద ప్రొడక్షన్‌తో పనిచేయాలని నా కల. నేను వాళ్లతో పనిచేయాలని అనుకున్నాను. శంకర్ నాతో వ్యక్తిగతంగా సినిమా చేస్తాడా అంటే చేయకపోవచ్చు. కానీ ఆయనతో చేసే అవకాశం నాకు దొరికింది కదా.. అది నాకు కావాలి’’ అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి (Priyadarshi). ప్రియదర్శి మాత్రమే కాదు.. ‘గేమ్ ఛేంజర్’లో నటించిన ఎంతోమంది ఇతర నటీనటుల విషయంలో కూడా ఇదే జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎడిటింగ్ వల్ల మంచి మంచి పాత్రలు తెరపై చూడలేకపోతున్నామని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.