Priyadarshi: సినిమా ప్రపంచంలో విజయం ఒక్కరోజులో రాదు. ప్రతి దర్శకుడికి, నటుడికి వెనుక ఎంతో కష్టమయిన జర్నీ ఉంటుంది. ఎవరు ఎక్కడ మొదలయ్యారో కాదు, ఎక్కడికి వెళ్లారన్నదే అసలు సంగతి. రీసెంట్‌గా కోర్ట్ సినిమాతో మరో హిట్ అందుకున్న ప్రియదర్శి, ఒక ఇంటర్వ్యూలో తన మంచి స్నేహితుడు, బలగం దర్శకుడు వేణు గురించి మాట్లాడాడు.
ప్రియదర్శి తన మాటల్లో – “వేణుని చూస్తే నేచురల్‌గా కామెడీ సినిమాలు చేస్తాడనిపిస్తుంది. కానీ అతను ‘బలగం’ లాంటి భావోద్వేగాలతో నిండిన సినిమా తీశాడు.” అని చెప్పుకొచ్చాడు.
కష్టాల్లో పెరిగిన వేణు – అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్ దాకా
వేణు సినిమా కుటుంబం నుంచి రాలేదు. అతని తల్లి కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించింది. అలాంటి వాతావరణంలో పెరిగిన వేణు చిన్నప్పటి నుంచే జీవితంలోని కష్టాలను దగ్గరగా చూశాడు. తన చదువు పూర్తయ్యాక సినిమా వైపు ఆకర్షితుడయ్యాడు. మొదట చిత్రం శ్రీనుకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సినిమా పనిలో ఉన్నప్పటికీ, అతనికో నటన మీద కూడా ఆసక్తి ఉండేది. అందుకే అతను నటుడిగా కూడా ప్రయాణం మొదలు పెట్టాడు.
ప్రభాస్ మున్నా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత జబర్దస్త్ లాంటి షోల ద్వారా తన హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతని నిజమైన లక్ష్యం దర్శకుడిగా ఎదగడమే. జబర్దస్త్, సినిమాల్లో నటిస్తూ మంచి అనుభవం సంపాదించుకున్నాడు. కానీ అతని అసలు కల మాత్రం దర్శకత్వం.
ఈ జర్నీని గురించి ప్రియదర్శి “వేణు చిన్న వయసులోనే చాలా కష్టాలు చూశాడు. ఒక రాత్రికిరాత్రే స్టార్ డైరెక్టర్ కాలేడు. చాలా స్ట్రగుల్ చేశాడు. కానీ ఆ స్ట్రగుల్ వల్లే ‘బలగం’ లాంటి సినిమా తీసే స్థాయికి ఎదిగాడు”
బలగం సక్సెస్ – కంటెంట్‌ని నమ్మిన దర్శకుడు
తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ అంటే స్టార్ హీరో, భారీ బడ్జెట్, మాస్ ఎలిమెంట్స్ ఉండాలి అనుకునే రోజుల్లో, వేణు మాత్రం కేవలం కథను నమ్మాడు. బలమైన కథకు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో బలగం నిరూపించింది. ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించే అతితక్కువ సినిమాల్లో బలగం ఒకటి. దర్శకుడిగా వేణుకు అది మైలురాయి.
ఎల్లమ్మ – వేణు నెక్స్ట్ సినిమా
బలగం తర్వాత, వేణు తన తదుపరి సినిమా ఎల్లమ్మ కోసం ప్లాన్ చేస్తున్నాడు. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం నాని హీరోగా అనుకున్నా, కొన్ని కారణాల వల్ల అది నితిన్ చేతికి వెళ్లింది. అలాగే, హీరోయిన్ విషయంలో కూడా మార్పులు జరిగాయి – మొదట సాయి పల్లవి ఎంపిక అయినా, ఇప్పుడు కీర్తి సురేష్ పాత్రలోకి వచ్చిందని సమాచారం. హీరోలు మారినా, హీరోయిన్ మారినా, టెక్నీషియన్లు మారినా, వేణు తన కథను మార్చకపోతే చాలు. అతను చెప్పాలి అనుకున్నది అలాగే చెప్పి, ఆ నేటివిటీని నిలబెట్టగలిగితే, తెలుగు ప్రేక్షకులకు మరో మంచి సినిమా దొరికినట్లే.