Priyamani: సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ హీరోహీరోయిన్‌కు డ్రీమ్ రోల్, డ్రీమ్ డైరెక్టర్ అనేవారు ఉంటారు. ఆ డ్రీమ్ డైరెక్టర్‌తో పనిచేయడం కోసం, వారి సినిమాలో నటించడం కోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధమవుతారు. ఇక సీనియర్ హీరోయిన్ ప్రిమయణికి కూడా అలాంటి డ్రీమ్ డైరెక్టర్ ఉన్నారని తాజాగా బయటపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోయింది ప్రియమణి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా తన ఫేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. అంతే కాకుండా ‘ఫ్యామిలీ మ్యాన్ 3’కు సంబంధించి అప్డేట్ అందించింది.
ఊహించనివి జరుగుతాయి
ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ 3వ సీజన్‌ను చూడడానికి నేను కూడా ఎదురుచూస్తున్నాను. నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఈ సీజన్ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీజన్ 3 కోసం ఎదురుచూస్తూ ఉండండి. ఇందులో మీరు ఊహించనివి చాలా జరుగుతాయి’’ అంటూ ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేసింది ప్రియమణి.
ఫోన్ రావడమే ఆలస్యం
తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) అని చెప్తూ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ‘రావనన్’ అనే మూవీలో నటించింది ఈ సీనియర్ బ్యూటీ. ఆ మూవీ హిందీ వర్షన్ అయిన ‘రావన్’లో కూడా మళ్లీ అదే పాత్ర చేసింది. దాని గురించి మాట్లాడుతూ.. ‘‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను మణి సార్ సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఆయన దర్శకత్వంలో ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా ఓకే చెప్తానంటోంది.
Also Read: కాపీరైట్స్ కేసులో మద్రాస్ హై కోర్టు తీర్పు.. నయన్‌కు కాపాడలేకపోయిన నెట్‌ఫ్లిక్స్..
స్పష్టంగా చెప్పారు
మణిరత్నంతో కలిసి ‘రావనన్’ చేసిన రోజులను గుర్తుచేసుకుంది ప్రియమణి (Priyamani). ‘‘మణి సార్ నా దగ్గరకు వచ్చి దీనిని ఎలా చేస్తావని అడిగారు. జముని పాత్ర ఎలా చేయాలి అని నాకొక విజన్ ఉంది. ముందుగా దానిని తమిళంలో చేశాం. అందుకే ఆయన నా దగ్గరకు వచ్చి ప్రియమణి ఎలా యాక్ట్ చేస్తుందని కాదు వెన్నెల ఎలా యాక్ట్ చేస్తుందో నేను చూడాలి అన్నారు. వెన్నెల బ్రతికుంటే ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచించేలా చేశారు. డ్రమాటిక్‌గా అనిపించొద్దు, నటనలాగా అనిపించొద్దు. నిజంగానే అలాంటిది జరిగితే ఎలా రియాక్ట్ అవుతామో అలా చేయాలి అని చెప్పారు’’ అంటూ మణిరత్నం టేకింగ్ గురించి వివరించింది ప్రియమణి.