Avinash Reddy: ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంలో వైసీపీ తిరుగులేదని చెబుతారు. గడిచిన ఐదేళ్లు చేసింది కూడా అదే. నీతి ఆయోగ్ రిపోర్టుపై సోమవారం మీడియా ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు, ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. గడిచిన ఐదేళ్లు ఏపీని వైసీపీ ఏవిధంగా ఛిన్నాభిన్నం చేసింది కళ్లకు కట్టినట్టు వివరించారు. తల తాకట్టు పెట్టయినా హామీలను నెరవేరుస్తామని మొదటి నుంచి చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు మాటలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఒక్కసారిగా వైసీపీ నేతలు లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. సీఎంపై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికే సీఎం చంద్రబాబు వేసిన ఎత్తుగడగా వర్ణించారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేమని సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 5 లక్షల కోట్ల అప్పులు, బడ్జెట్‌లో 100 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని చేశారని గుర్తు చేశారు.
కోవిడ్‌తో రాబడి తగ్గినా హామీలు అమలు చేసి చూపించామన్నారు ఎంపీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీల అమలు చెయ్యలేనని చెప్పడం దారుణ మన్నారు. జగన్ పాలనకు-చంద్రబాబు పాలనకు తేడాను గమనించాలని ప్రజలను కోరారు.
ALSO READ: అది పనికిమాలిన పిటిషన్ – సీఎం చంద్రబాబు కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఇదే క్రమంలో స్థానిక ఇష్యూలను లేవనెత్తారు అవినాష్ రెడ్డి. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో అధికార పార్టీ సపోర్టుతో జూదం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. వీటి బారినపడి ఎంతో మంది రోడ్డు మీద పడ్డారంటూ దుమ్మెత్తిపోశారు.
పులివెందుల ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీ అయిన సందర్భాల్ని గుర్తు చేశారు. అవి ఏమయ్యాయో పట్టించుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు లేరన్నారు. ఏ ఒక్క సమస్యపైనా దృష్టి సారించటం లేదంటూ కాసింత ఆగ్రహం వ్యక్తంచేశారు.