Priyanka Chopra: ఇండియన్ ఇండస్ట్రీ నుండి చాలా తక్కువమంది నటీనటులు మాత్రమే హాలీవుడ్ వరకు వెళ్లి తమ టాలెంట్ నిరూపించుకోగలిగారు. అలా ముందుగా బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రియాంక చోప్రా. అసలు తను హీరోయిన్ అవ్వాలని అనుకోలేదని, తనకు సినిమాల గురించి మొదట్లో పెద్దగా తెలియదని పలుమార్లు బయటపెట్టింది. తాజాగా తను హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు ఒక దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరు గురించి రివీల్ చేసింది. ఆయన అన్న మాటలకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడి పేరు ఏంటో చెప్పకపోయినా కూడా కెరీర్ మొదట్లో అతడితో పనిచేశానని తెలిపింది ప్రియాంక చోప్రా.
దర్శకుడి మాటలు
ప్రియాంక చోప్రా 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటికీ తనకు అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా కెరీర్ మొదట్లోనే ఒక దర్శకుడితో ఎదురైన చేదు అనుభవం గురించి తాజాగా బయటపెట్టింది ప్రియాంక. ‘‘నేను ఒక దర్శకుడిని కలిశాను. తనకు ఎలాంటి బట్టలు కావాలో నా స్టైలిస్ట్‌తో మాట్లాడుకోమని అడిగాను. అతడు నా స్టైలిస్ట్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను’’ అంటూ గుర్తుచేసుకుంది ప్రియాంక చోప్రా. ఆ సమయంలో డైరెక్టర్ మాట్లాడిన మాటలు తాను ఇంకా మర్చిపోలేదని అసలు ఏం జరిగిందో వివరంచింది.
అలాంటి పదాలు
‘‘తను ఫోన్ తీసుకొని.. చూడండి ప్రేక్షకులు తను లోదుస్తులు చూపిస్తేనే తనను చూడడానికి థియేటర్లకు వస్తారు. కాబట్టి బట్టలు చాలా చిన్నగా ఉండాలి. తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ అదే పదాన్ని దాదాపు నాలుగుసార్లు ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పుడు నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. మరింత చండాలంగా అనిపించింది’’ అని వివరించింది ప్రియాంక చోప్రా. అలా కెరీర్ మొదట్లోనే చేదు అనుభవాన్ని ఎదుర్కున్న ప్రియాంక.. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని బయటపెట్టింది. ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి అనుకున్నట్టు తెలిపింది.
Also Read: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి గెలిచాను.. కెరీర్ విషయంలో పూజా హెగ్డే కామెంట్స్
నా ఛాయిస్
‘‘నేను అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లి నేను ఆ డైరెక్టర్ మొహాన్ని చూడలేకపోతున్నాను, అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అంటూ అమ్మతో చెప్పేశాను. ఆ తర్వాత వెళ్లి సినిమా నుండి తప్పుకొని శారీ, నేను చేయలేను అని చెప్పేశాను. ఇప్పటివరకు కూడా నేను మళ్లీ అతడితో కలిసి పనిచేయలేదు. నేనేం చేయాలి అనేది నా ఛాయిస్. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌కు వెళ్లాలి అనుకున్నప్పుడు కూడా ప్రియాంక చోప్రా ఎన్నో అవమానాలు ఎదుర్కుంది. అవన్నీ దాటుకొని ప్రస్తుతం ఇంటర్నేషనల్ సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం తను ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’తో బిజీగా ఉంది.