Prudhvi Raj Controversy : గత రెండు రోజుల నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి (Prudhvi Raj) చేసిన కామెంట్స్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘లైలా’ (Laila) టీం స్వయంగా క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా సద్దుమనగలేదు. ఓవైపు పృథ్వి తనను టార్గెట్ చేస్తున్న వారిపై విరుచుకుపడుతుంటే, మరోవైపు నెట్టిజనులు అంతకంతకూ రెచ్చిపోతున్నారు. తాజాగా పృథ్వి వ్యవహారంపై ప్రముఖ నిర్మాత చిట్టిబాబు (Producer Chittibabu) షాకింగ్ కామెంట్స్ చేశారు.
చిట్టిబాబు తాజాగా ఈ విషయమై మాట్లాడుతూ పృథ్వీరాజ్ నోటిదూల వల్ల ఇండస్ట్రీకి నష్టం జరుగుతోందని మండిపడ్డారు. పృథ్వీని ఉద్దేశిస్తూ “నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు ఏమీ కాదు, కమెడియన్ లో మాత్రమే. ఒక పార్టీలో ఉండి, చండాలమైన పనులు చేసి ఆ తర్వాత మరో పార్టీకి వెళ్లావు. ఆ తర్వాత విడిచి పెట్టిన పార్టీని తిట్టడం అనేది చాలా తప్పు” అంటూ పృథ్వీరాజ్ పై చిట్టిబాబు మండిపడ్డారు. నిర్మాత చిట్టిబాబు గతంలోనూ పవన్, సమంత వంటి స్టార్స్ పై ఇలాగే విరుచుకుపడ్డారు.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పృథ్వి
ఇక రెండు రోజుల నుంచి వైకాపా సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోంది అంటూ నటుడు పృథ్వీరాజ్ తాజాగా, సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కుటుంబ సభ్యులతో సహా ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫోన్ కాల్స్, మెసేజ్ లతో తనని ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. కంప్లైంట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “నా నెంబర్ ను సోషల్ మీడియా గ్రూప్ లో ఉంచి, 1800 ఫోన్ కాల్స్ చేయించారు. మా అమ్మ, భార్య, పిల్లలను కూడా తిట్టించారు. వీళ్ళ వేధింపులు తాళలేకనే ఆస్పత్రిలో చేరాను. ముఖ్యంగా అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా కంప్లైంట్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. త్వరలో ఏపీ హోమ్ మంత్రిని కూడా కలిసి ఈ విషయమై కంప్లైంట్ చేస్తాను. నన్ను వేధించిన వారిపై కోటి రూపాయలకు పైగా పరువు నష్టం దావా వేస్తాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘లైలా’ ఈవెంట్ లో పృథ్వి కామెంట్స్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ పై తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేడుకలో తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ టైంలో జరిగిన విశేషాలను వెల్లడిస్తూ “150 మేకల్లో చివరకు 11 మిగిలాయి” అని పృథ్వి చెప్పడం రాజకీయంగా దుమారం రేపింది. దీంతో ఒక్కసారిగా ‘లైలా’ మూవీని బాయ్ కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ‘లైలా’పై నెగెటివ్ ప్రచారం మొదలైంది. ఈ ట్రెండ్ ఊహించని విధంగా తెరపైకి రావడంతో మూవీ రిలీజ్ కి ముందు కొత్త కష్టాలు మొదలయ్యాయి. దీంతో హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ రామ్ నారాయన్ తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ తప్పును క్షమించాలంటూ కోరారు. ఇక ఈనెల 14న ‘లైలా’ మూవీ థియేటర్లోకి రాబోతోంది.