Producer Naga Vamsi : నటసింహం నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా ఆయన తన 109వ సినిమాను బాబి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారని ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా వెల్లడించారు. ‘డాకు మహారాజ్’ మూవీని జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే చిత్ర బృందం ప్రమోషన్లు షురూ చేసింది.
‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కి హాజరైంది. అందులో భాగంగా నిర్మాత నాగవంశీ (Producer Naga Vamsi) మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులతో పాటు పెయిడ్ ప్రీమియర్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగ వంశీ మాట్లాడుతూ “సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు. కానీ తెల్లవారుజామున 4:30 గంటలకు సినిమా పడితే చాలు. సీఎం గారు చెప్పేశారు ఓకే. కానీ ఎఫ్డిసి చైర్మన్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చాక ఏం తేలుస్తారో చూడాలి. దిల్ రాజు హైదరాబాద్ వచ్చాక అందరం కలిసి డిసైడ్ చేసి మాట్లాడతాము. అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత, సీఎంను కలిసే నిర్ణయాన్ని తీసుకుంటాము. అదే టైంలో టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల గురించి చర్చిస్తాము” అంటూ తాజాగా తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం గురించి స్పందించారు.
ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి మాట్లాడుతూ “మొన్న జరిగింది అనుకోని సంఘటన. ఏ నిర్మాతగానీ, హీరోగానీ అలా జరగాలని కోరుకోరు. మా వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము” అని అన్నారు. మరి సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ… “ఆ వార్తలను అవాస్తవం. నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మొదటి సమావేశంలోనే ప్రభుత్వం తరఫున సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయిన అన్ని సినిమాలకు చెప్పినట్టుగా సహకరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందనే అనుకుంటున్నాము. అయితే పరిశ్రమ ఏపీకి తరలిపోవట్లేదు. ఏపీతోపాటు తెలంగాణలో కూడా సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు నాగ వంశీ (Producer Naga Vamsi) .