Pushpa 2 Ticket Prices: ఏ భాషలో అయినా పాన్ ఇండియా రేంజ్‌లో, పాన్ ఇండియా బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిందంటే చాలు.. దానికి సంబంధించిన టికెట్ ధరలను విపరీతంగా పెంచేసి, మామూలు మిడిల్ క్లాస్ మూవీ లవర్‌పై అదనపు భారం వేయడం సినీ నిర్మాతలకు అలవాటుగా మారిపోయింది. అలాగే ఇంతకు ముందు ఏ సినిమాకు లేని రేంజ్‌లో ‘పుష్ప 2’ టికెట్ ధరలు పెరిగిపోయి ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ఇప్పటికీ ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కినా ఈ రేంజ్‌లో టికెట్ ధరలు మాత్రం ఎప్పుడూ పెరగలేదు. ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివిటీ వచ్చినా తగ్గని నిర్మాతలు మొత్తానికి కళ్లు తెరుచుకొని టికెట్ ధరల విషయంలో దిగొచ్చినట్టు తెలుస్తోంది.
దిగొచ్చిన నిర్మాతలు
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకు పెంచిన రేంజ్‌లో మరే ఇతర సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంచలేదు. దీంతో ఈ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటి నుండి ప్రేక్షకులంతా దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ రేంజ్‌లో ధరలు పెరిగితే సినిమా చూడాలని ఉన్నా చూడలేము అంటూ కామెంట్స్ చేశారు. అయినా కూడా చాలామంది ప్రేక్షకులు ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలు చూడడానికి వెళ్లారు. దాదాపు అన్ని థియేటర్లలో ఈ ప్రీమియర్లు హౌస్‌ఫుల్ షోలతో నడిచాయి. దానివల్లే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. దాని వల్ల నిర్మాతలు కూడా దిగొచ్చారు.
Also Read: ‘పుష్ప 2’ చూడడానికి వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్… 19 ఏళ్ల యువకుడి మృతి
మర్చిపోలేని దుర్ఘటన
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి ‘పుష్ప 2’ను చూడాలనుకున్నాడు అల్లు అర్జున్. హీరో వచ్చాడని చూడడం కోసం ఫ్యాన్స్ అంతా ఎగబడ్డారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగింది. అందులో ఒక మహిళ మృతి చెందింది. ఈ విషయంపై మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా స్పందించారు. ఇలా జరగడం కరెక్ట్ కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీరియస్ అవ్వడంతో పాటు ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో పాటు టికెట్ ధరల పెంపుపై కూడా ఆలోచిస్తామన్నారు. దీంతో ‘పుష్ప 2’ నిర్మాతలు అలర్ట్ అయ్యారు.
కళ్లు తెరుచుకున్నాయి
మొదటి వీకెండ్ పూర్తయిన తర్వాత నైజాంలో టికెట్ ధరలు పూర్తిగా తగ్గించేయాలని ‘పుష్ప 2’ నిర్మాతలు నిర్ణయించుకున్నారు. సోమవారం నుండి నైజాంలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు మామూలు స్థాయికి రానున్నాయి. సింగిల్ స్క్రీన్స్‌కు రూ.200, 140, 80 రేట్లు ఫిక్స్ చేయనున్నారు. ఈ ధరలు చూసిన తర్వాత మొత్తానికి ‘పుష్ప 2’ మేకర్స్ కళ్లు తెరుచుకున్నాయని, అత్యాశ కూడా మంచిది కాదని అర్థం చేసుకున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ ప్రీమియర్ షోల నుండి చాలావరకు పాజిటివ్ టాక్ రాగా.. ఆ తర్వాత చూసిన ప్రేక్షకులు దీనికి మిక్స్‌డ్ టాక్ అందిస్తున్నారు. మొత్తానికి ‘పుష్ప 2’ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయం అందరిలో ఆసక్తికరంగా మారింది.