PVR Inox: ఒక సినిమాను చూడడానికి థియేటర్‌కు వెళ్లిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి ఆ సినిమా సమానంగా నచ్చుతుందని నమ్మకం లేదు. ఎన్నో గొప్ప అవార్డులను అందుకున్న సినిమాలను కూడా ఇష్టపడనివారు ఉన్నారు. అలాగే డిశాస్టర్ అయిన చిత్రాలను ఇష్టపడినవారు కూడా ఉన్నారు. అలా ఒక సినిమాను అందరూ సమానంగా ఇష్టపడరు అని తెలిసినా ఇండియాలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్.. ఒక కొత్త స్కీమ్‌తో ముందుకు రానుంది. సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇచ్చేస్తామని అంటోంది. అసలు ఇది ఎలా సాధ్యం, ఇది అయ్యే పనేనా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది. అసలు పీవీఆర్ ప్లానింగ్ ఏంటని చర్చలు కూడా మొదలయ్యాయి.
పక్కా ప్లానింగ్
సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేయడం అనే ఐడియా చాలా క్రియేటివ్‌గా ఉంది. కానీ ఈ స్కీమ్‌ను నిజంగా జరిగేలా చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి పీవీఆర్ ఈ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలని ప్లాన్ చేసిందని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ సినిమా నచ్చకుండా ప్రేక్షకుడు బయటికి వచ్చేస్తే టికెట్ ప్రైజ్‌లోని కొంత అమౌంట్ తిరిగి ఇచ్చేయడానికి పీవీఆర్ సిద్ధపడిందట. కానీ ఏమీ ఆలోచించకుండా రిఫండ్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రేక్షకుడికి ఎంత అమౌంట్ తిరిగి ఇవ్వాలనేది డిసైడ్ అవుతుందని సమాచారం. ఆ విషయంలో పీవీఆర్ పక్కా ప్లానింగ్‌తో ఉందట.
Also Read: అందరి ముందు పరువు పోగొట్టుకున్న రష్మిక.. సారీ చెప్పక తప్పలేదు!
సినిమాను బట్టి
సినిమా నచ్చక ప్రేక్షకుడు బయటికి వచ్చేస్తే ఇంకా ఆ సినిమా అయిపోవడానికి ఎంత సమయం మిగిలి ఉందో దాన్ని బట్టి రిఫండ్ వస్తుందని తెలుస్తోంది. ఒకవేళ పీవీఆర్.. ఇదే ప్లాన్ వర్కవుట్ అయ్యేలా చేస్తే ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం పీవీఆర్ (PVR) చేసినట్టుగా నిలిచిపోతుంది. కానీ ఒకేసారి దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ స్క్రీన్స్‌లో ఈ ఐడియాను అమలు చేయడం కష్టం కాబట్టి ముందుగా దీనిని ప్రయోగించడం కోసం ఢిల్లీని ఎంచుకుంది పీవీఆర్ యాజమాన్యం. ముందుగా ఢిల్లీ ప్రేక్షకులతో ఈ ప్రయోగం చేసి, అక్కడ రిజల్ట్‌ను బట్టి మెల్లగా దేశవ్యాప్తంగా ఈ ఐడియాను వర్కవుట్ అయ్యేలా చేయాలని పీవీఆర్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది.
ఎవరికి నష్టం.?
తెరపై వచ్చే సినిమా చూడలేక నచ్చక తిరిగి వెళ్లిపోతే ఇంకా ఎంత సినిమా మిగిలి ఉందో దాన్ని బట్టి రిఫండ్ ఇవ్వడం అనే ఐడియా చాలా కొత్తగా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ అంతకంటే ముందు పీవీఆర్.. తమ టికెట్ ధరలను పెంచే ప్లాన్‌లో ఉందని తెలుస్తోంది. రిఫండ్ వచ్చేలా సినిమా చూడాలంటే ముందు ఉన్న టికెట్ ప్రైజ్‌కు 10 శాతం ప్రీమియమ్ యాడ్ అవ్వనుందట. దీన్ని బట్టి చూస్తే రిఫండ్ ప్రోగ్రాం అనేది ముందుగా పీవీఆర్‌కు నష్టం కలిగేలా అనిపించినా కండీషన్స్ అన్నీ విన్న తర్వాత ప్రేక్షకులకే ఇది నష్టం చేకూరుస్తుందేమో అని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నచ్చని సినిమాను కష్టంగా చివరి వరకు చూడకుండా మధ్యలో వెళ్లిపోవడానికి ఇదొక మోటివేషన్ అనుకుంటున్నారు.