Radha Manohar Das: ప్రపంచ యాత్రికుడిగా ‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానల్ స్థాపించి.. పలు దేశాలు విహరిస్తూ.. ఆ ప్రదేశాలలో ఏవి అత్యంత చౌక ధరకు లభిస్తాయి ..ఏ ప్రాంతంలో ఏం జరుగుతోంది.. ? ఎక్కడికి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా మనం వాటి నుండి బయటపడాలి? అనే విషయాలను ప్రజలకు చేరవేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు యూట్యూబర్ అన్వేష్ (Youtuber Anvesh). ఇక ఈ మధ్యకాలంలో అన్వేష్ పేరు ఎక్కువగా వినిపిస్తోందనే చెప్పాలి. కారణం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తూ పట్టుబడిన వారి గురించి అసలు నిజాలు బయట పెడుతూ అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు.
బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై మండిపడ్డ అన్వేష్..
ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి భారీగా డబ్బు సొంతం చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఒక్కొక్కరిగా ఏరుతూ వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఏఎస్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే యూట్యూబర్ నాని (Youtuber Nani) తో పాటు మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) లపై కేసు నమోదు అయింది. అలాగే హర్షసాయి (Harsha Sai) తో పాటు పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు, యాంకర్లపై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ , యూట్యూబర్ నాని గుట్టు బట్టబయలు చేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా విమర్శలు గుప్పిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. సమాజ శ్రేయస్సుకు తన వంతుగా ప్రయత్నం చేస్తానని, సమాజం బాగు కోసం పాటుపడతానని చెబుతున్న అన్వేష్ గురించి తాజాగా పండిట్ రాధా మనోహర్ దాస్ (Radha Manohar Das) మాట్లాడడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.
అన్వేష్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన రాధా మనోహర్ దాస్..
సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. నిత్యం దేశం బాగుకోసం ఆరాటపడే పండితులలో రాధా మనోహర్ దాస్ కూడా ఒకరు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. అన్వేష్ గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..” ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. ఈయనను సర్వ జీవ భక్షక అనే పేరు వుంది. ఈయనకు సంబంధించిన పలు వీడియోలు నేను చూశాను. ఆయన పలు ప్రపంచ దేశాలు తిరుగుతూ.. ఎన్నో విషయాలను మనకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలపై కూడా స్పందించి చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అందులో ఆయన కొన్ని నిజాలు కూడా చెప్పారు. అవన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి.ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని డైనమైట్స్ పెట్టి పేల్చేశారు. అక్కడికి అన్వేష్ వెళ్లారు. ఆ విగ్రహాన్ని మన భారతీయులు మేం తీసుకుంటామని చెప్పిన సరే వారు అత్యంత కర్కశంగా ఆ విగ్రహాన్ని పగలగొట్టారు. ఈ విషయాన్ని మనకు అన్వేష్ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించారు. అలాగే పలు ఇన్ఫర్మేషన్ వీడియోలను కూడా ప్రజలకు చేరవేశారు” అంటూ అన్వేష్ పై రాధా మనోహర్ దాస్ ప్రశంసల కురిపిస్తూ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అటు అన్వేష్ పై కూడా పలువురు పాజిటివ్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న అన్వేష్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న వారిపై కూడా పలు కామెంట్లు చేస్తూ వారి రహస్యాలు బయటపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు.