Upasana : మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టేది వారసుడా? వారసురాల అనే ఉత్కంఠకు తెరపడింది. మెగా కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ప్రసవం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి ప్రకటించింది. చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైంది. ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని గతేడాది డిసెంబర్ 12న చిరంజీవి వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.
ఉపాసన ప్రసవం కోసం హాస్పిటల్‌లో చేరుతున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి అభిమానులు శుభసందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీతోపాటు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్-ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు మెగా అభిమానులకు పిలుపునిచ్చారు.
సాధారణంగా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారన్న ఉపాసన తాము మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను, చెర్రీ అత్తమామలతో కాకుండా వేరే చోట ఉంటున్నామని చెప్పారు. బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరంట్స్ కీలక పాత్ర పోషించారన్నారు. గ్రాండ్ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.