Ram Gopal Varma : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) . ముఖ్యంగా తాను చెప్పాలనుకున్న మాటను స్ట్రెయిట్ గా చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో వర్మ చేసిన ఒక పని వల్ల ఇప్పుడు ఈయనపై పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని, ఒంగోలు పోలీసులు రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపించగా.. రెండుసార్లు కూడా ఆయన తన పనిలో బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేనని లాయర్ తో చెప్పించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట..
అంతేకాదు ముందస్తు బెయిల్ కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోరగా.. తాజాగా రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 9 వరకు వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాదు రాంగోపాల్ వర్మ మీద నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో హైకోర్టులో వర్మకు ఊరట లభించిందని చెప్పవచ్చు.
ప్రెస్ మీట్ పెట్టిన డైరెక్టర్ వర్మ..
అయితే తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియాపై మండిపడుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, పలు ప్రాంతాలలో ఆయన పైన కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో కూడా కేసు నమోదు అవ్వగా.. తొలుత నవంబర్ 17వ తేదీన ఒంగోలు పోలీసులు రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్లి, విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. కానీ ఆయన వారం రోజులపాటు హాజరుకాలేనని లాయర్ తో తెలిపారు. ఆ తర్వాత విచారణను నవంబర్ 24కి వాయిదా వేయగా ఆ రోజు కూడా.. తాను దర్శకత్వం వహిస్తున్న శారీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంవల్ల హాజరు కాలేదు. దీంతో రాంగోపాల్ వర్మపై మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా వర్మ మాట్లాడుతూ మండిపడ్డారు.
డెన్‌లోకి పోలీసులు రాలేదు…
వర్మ మాట్లాడుతూ.. “పోలీసులు నాకు నోటీసులు ఇచ్చినప్పుడు నేను వారికి బదులిచ్చాను. ఎన్ని ట్వీట్లు చేశానో ..? ఏం చేశానో.. ?నాకు గుర్తులేదు. వర్చువల్ విచారణకు కూడా నేను సిద్ధమే అని వారితో తెలిపాను. అయినా సరే ఇవేవీ పట్టించుకోకుండా.. జరిగిన దానికి భిన్నంగా నా చుట్టూ కొంతమంది స్క్రిప్ట్ రాసేశారు. గోడ దూకి పారిపోయాను అంటూ ప్రచారం చేశారు. నా కోసం ఆరు టీమ్ లు గాలిస్తున్నాయని కూడా ప్రచారం చేశారు. కేరళలో, కోయంబత్తూర్లో పోలీసులకు భయపడి దాకున్నట్లు కూడా చెప్పారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాగార్జున (Nagarjuna ) నన్ను దాచేసారంటూ కూడా వార్తలు ప్రచారం చేశారు. పోలీసులు అసలు నా డెన్ లోకే రాలేదు. నేను డెన్ లో దొరకకపోతే, కుటుంబ సభ్యులను అడగాలి. అక్కడ కూడా సమాధానం లేకపోతే అప్పుడు నా కోసం వెతుకుతారు. కానీ అవన్నీ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.
పోలీసులు కాదు.. మీడియానే డిటెక్టివ్…
“నా కోసం గాలిస్తున్నట్టు కనీసం పోలీసులు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో ఎవడెవడో పోస్టులు పెడుతున్నారు. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఏమైంది..? సోషల్ మీడియా కంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు డేంజర్ గా మారింది. ముఖ్యంగా డిటెక్టివ్ అనేది ఇప్పుడు పోలీసులు కాదు.. సోషల్ మీడియానే డిటెక్టివ్ గా మారిపోయింది. న్యూస్ లేకపోతే న్యూస్ ని సృష్టిస్తున్నారు. నా విషయంలో కూడా అదే జరిగింది.సోషల్ మీడియా లో టూ మచ్ చేయవద్దంటారు. అది ఎలా చెబుతారు. ఒక కార్టూన్ పోస్టును అనేక రకాల కోణాలలో ఆపాదించుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాకి లెక్చర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు. నన్ను కోడ్ చేస్తూ మెయిన్ స్ట్రీమింగ్ మీడియా కూడా పోస్ట్ పెడుతుంది” అంటూ మీడియా పై అసహనం వ్యక్తం చేశారు రాంగోపాల్ వర్మ.
అంతేకాదు వర్మ మాట్లాడుతూ.. “నేను లైవ్ లో ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చి లైవ్ లో మాట్లాడాను. ఎన్నోసార్లు ట్వీట్స్ చేశాను. ఇంతలా మీ ముందుకు వస్తున్నా.. నేనింకా పారిపోయానని వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్.. అంటూ మండిపడ్డారు వర్మ.