Rana Daggubati: కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ రంగాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొని సత్తా చాటుకున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అందులో టాలీవుడ్ నుండి రానా పేరు ముందుంటుంది. రానా హీరోగా సినిమాలు చేసి చాలాకాలమే అయ్యింది. కానీ ఈ గ్యాప్‌లో ఒక ప్రజెంటర్‌గా, ఒక నిర్మాతగా తను చాలా బిజీ అయిపోయాడు. పైగా అమెజాన్ ప్రైమ్‌లో మొదలయిన ఒక టాక్ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ప్రజెంటర్‌గా రానా ఇప్పటికే చాలా సక్సెస్ చూశాడు. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో తను సినిమా చేయాలని ప్లాన్ చేసినా.. తనతో సినిమా చేయాలంటే ఈ పని చేయాలంటూ కండీషన్ పెట్టాడట డీజే టిల్లు.
నిర్మాతగా రానా
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), శ్రద్దా శ్రీనాధ్, సీరత్ కపూర్, షాలిని హీరోహీరోయిన్లుగా నటించిన సినిమానే ‘కృష్ణ అండ్ హిస్ లీలా’. కోవిడ్ సమయంలో విడుదలయిన ఈ సినిమా.. చాలామంది యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీని వల్లే చాలావరకు ప్రేక్షకులు సిద్ధు దగ్గరయ్యాడు. నేరుగా ఓటీటీలో విడుదలయిన ఈ మూవీ.. వెంటనే ఫేమ్‌ను సంపాదించుకోలేకపోయింది. కానీ మెల్లగా దీనికి సంబంధించిన సీన్స్ వైరల్ అవ్వడంతో చాలామందికి ఈ సినిమా గురించి తెలియడం మొదలయ్యింది. ఇప్పుడు ఇదే మూవీ వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. కానీ టైటిల్ మాత్రమే మారింది. ఇప్పుడు ఇది ‘ఇట్స్ కాంప్లికేటేడ్’ అయ్యింది. దీనికి రానానే నిర్మాత.
అదే కండీషన్
2020 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయ్యింది ‘కృష్ణ అండ్ హిస్ లీలా’. ఇప్పుడు ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయడానికి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’గా పేరు మార్చారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం హీరో సిద్ధు, ప్రొడ్యూసర్ రానాతో పాటు దర్శకుడు రవికాంత్ పేరేపు కూడా రంగంలోకి దిగాడు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు రానా. ‘‘నేను సిద్ధు జొన్నలగడ్డతో మరొక సినిమాను నిర్మించాలని అనుకున్నాను. కానీ తను కూడా కృష్ణ అండ్ హిస్ లీలాను రీ రిలీజ్ చేస్తేనే మరొక ప్రాజెక్ట్ ఒప్పుకుంటానని కండీషన్ పెట్టాడు. చెప్పాలంటే ఇది రీ రిలీజ్ కూడా కాదు. మొదటిసారి ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది’’ అని చెప్పుకొచ్చాడు రానా (Rana).
Also Read: సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఇలా ఉండబోతుందా.? ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే.!
పోటీ లేదు
2025 వాలెంటైన్స్ డే సందర్భంగా ఎన్నో తెలుగు సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అందులో ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ (It’s Complicated) కూడా ఒకటి. దీనిని థియేటర్లలో చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని తెలిపాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇది రీ రిలీజ్ సినిమానే అయినా మొదటిసారి థియేటర్లలో విడుదల కానుండడంతో మేకర్స్ అంతా కలిసి గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’తో ఈ మూవీ పోటీపడడంపై సిద్ధు స్పందించాడు. ‘‘అది కొత్త సినిమా. మాది రీ రిలీజ్. కాబట్టి పోటీ అన్న మాటే లేదు’’ అన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మొత్తానికి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ను థియేటర్లలో చూడడానికి చాలామంది యూత్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.