Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల… ఇది కేవలం సినిమా పేరు కాదు. సినిమా సాహిత్యాన్ని కొన్నేళ్లు పాటు శాసించిన సాహిత్య రచయిత ముందు పేరు. ఈయన పాటలు మాత్రమే రాయలేదు. పాటలో పాఠాన్ని రాసారు. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా, అర్ధం ఉన్న ఓ పదము కానిదే అర్ధముండునా.? అని అడిగినట్లు ఆయన రాసిన ప్రతి పాటలో అర్ధం ఉంటుంది. పరమార్థం ఉంటుంది. సినిమాలో సన్నివేశాన్ని తీసి చదివిన అది మన నిజజీవితానికి అద్దం పడుతుంది. ప్రతి సన్నివేశానికి ఆయన అందించే సాహిత్యం వింటే అనుభవించి రాసారేమో అనిపిస్తుంది.
అనాధిగా బ్రతకడంలో కూడా ఆనందం ఉంటుందని, ఆయన సాహిత్యం వింటే అనిపిస్తుంది. సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా.? జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా.? అనే ప్రశ్నలతో ఆలోచనలో పడేస్తారు. ఆడిందే ఆటంట … పాడిందే పాటంట. ఆపేందుకు అమ్మానాన్నా లేరంట.. అంటూ అనాథతో పాడిస్తారు.
Also Read : Vivek Athreya To Hasith Goli : డైరెక్టర్ వెర్షన్ కంటే ఆడియన్స్ వెర్షనే చాలా బాగుంది
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే, ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే.?
అని మనల్ని ప్రశ్నించి… అది చరితలు సైతం చదవని వైనం. కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. అని ప్రేమకు ఒక నిర్వచనాన్ని ఇస్తారు. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే అని ప్రేమలోని విరహాన్ని చెబుతారు. అమ్మకు, అయ్యకు చుట్టం కాకపోయినా.. మనకు అన్ని అదే అవుతుందని “మనీ” వాల్యూ చెబుతారు.
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి..
సంతసాన మునిగింది సంతు లేని పార్వతి
సుతుడన్న మతి మరచి.. శూలాన మెడ విరిచి
పెద్దరికము చూపే చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా?.. బిడ్డ గతి కంటుందా?
అని సినిమా సన్నివేశానికి వినాయకుని కథని జోడించి చెప్పడం ఆ కలానికే చెందింది.
Also Read : Pushpa 2 Review Censor : పుష్ప 2 ఫస్ట్ సెన్సార్ రివ్యూ, జాతర ఎపిసోడ్ తోనే పైసా వసూల్
ఇలా ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో వందలు. సినిమా కోసం పాటలు రాయడం ఒక ఎత్తు, కానీ ఒక పాటను పెట్టుకోవడం కోసం సినిమా తీయడం మరొక ఎత్తు. జగమంతా కుటుంబం నాది అనే పాటకోసమే కృష్ణవంశీ (Krishna Vamsi) చక్రం (Chakram) సినిమాను తీశారంటే, అది సిరివెన్నెల సాహిత్యానికి ఉన్న స్థాయి. మాటల్లో చెప్పలేని ఎన్నో ఎమోషన్స్ ను , ఫీలింగ్స్ ను ఆయన పాటల్లో చెప్పగలరు. 2 గంటల సినిమాను కూడా నాలుగు లైన్స్ లో చెప్పగలిగే సామర్ధ్యం ఉన్న సాహిత్య రచయిత. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. అందుకే ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అని అయన పాట రాసినట్టు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఆయన లేరని మాటల్లో తలుచుకుందాం.
Remembering Sirivennela Seetharama Sastry Gaaru on His Death Anniversary Day 🙏