Renu Desai..ప్రముఖ హీరోయిన్, కాస్ట్యూమ్ డిజైనర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్(Renu Desai) ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబైలో జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇక తన సంపాదనలో వచ్చిన కొంత భాగాన్ని పిల్లల కోసం కేటాయిస్తూ , కొంత భాగాన్ని జంతు సంరక్షణ కోసం కేటాయిస్తున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా ప్రతినెల తన సంపాదనలో కొంత భాగాన్ని వాటి సంరక్షణకు కేటాయిస్తూ.. అవసరమైతే సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులను అడుగుతూ వుంటుంది. అయితే ఇలాంటి రేణూ దేశాయ్ అనూహ్యంగా తొందరపడి ఎన్జీవో సంస్థను ప్రారంభించానేమో అని తెలిపింది. అసలు రేణూ దేశాయ్ ఇలాంటి మాటలు అనడం వెనుక ఉన్న కష్టం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
డబ్బులు అయిపోయాయి.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..
ఈమధ్య కాలంలో సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈమె మరొకవైపు తన కూతురు ఆధ్యా పేరు మీద ‘శ్రీ ఆధ్య యానిమల్ షెల్టర్’ పేరిట.. జంతువుల కోసం ఒక ఎన్జీవో ప్రారంభించింది. జంతువుల ఆరోగ్యం, ఎవరూ పట్టించుకోని జంతువులకు ఫుడ్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీధి కుక్కల కోసం పనిచేస్తూ ఉండే రేణూ దేశాయ్.. మొదట సొంత డబ్బులతోనే మొదలుపెట్టి, ఇప్పుడు డొనేషన్స్ ఎవరైనా ఇస్తే తీసుకుంటుంది. అంతేకాదు నిత్యం సోషల్ మీడియాలో తాను జంతువుల కోసం చేసే సేవా కార్యక్రమాలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన ఇన్ స్టా పేజీను కూడా ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాదు జంతువుల సంరక్షణ కోసం ఒక అంబులెన్స్ కూడా కొన్న ఈమె ఒకానొక సమయంలో తన దగ్గర ఎన్జీవో కోసం పెట్టుకున్న డబ్బులు అన్ని అయిపోయాయని, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నానని తెలిపింది.
ఆ సమయంలో ఆయనే సహాయం చేశారు..
రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. జంతువులకు ఆరోగ్యం విషయంలో రోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అంబులెన్స్, ఎన్జీవో నిర్వహణ ఖర్చులు రోజురోజుకు పెరిగిపోయాయి. పైగా హాస్పిటల్ బిల్ల్స్ కూడా నన్ను ఆశ్చర్యపరిచేవి. ఇక నా దగ్గర ఉన్న డబ్బులు కాస్త అయిపోయాయి. అనవసరంగా కంగారు పడి ముందే ఎన్జీవో ప్రారంభించానేమో అని అనుకున్నాను. దీంతో కాలభైరవ గుడికి వెళ్లి స్వామి మీ కుక్కల కోసమే నేను పని చేస్తున్నాను. కానీ నా దగ్గర ఏమీ లేవు. నాకు ఏమీ వద్దు.. వాటికోసం డబ్బులు వచ్చేలా చూడు అని మొక్కుకున్నాను. ఆ మరుసటి రోజే ఒక పెద్ద ఎన్జీవో కంపెనీ నుండి నాకు ఒక పెద్ద మొత్తంలో అమౌంటు డొనేషన్ రూపంలో వచ్చింది. ఇక నేను వెంటనే కాలభైరవ స్వామికి దండం పెడుతూ థాంక్స్ చెప్పాను.. ఇక కష్ట సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు.. ఆ కాలభైరవుడి రూపంలో ఆ పెద్ద కంపెనీ ద్వారా నాకు డొనేషన్ లభించడం నిజంగా సంతోషంగా అనిపించింది” అంటూ రేణూ దేశాయ్ తెలిపింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా డబ్బులు అవసరమైతే కోరుతూ వాటి అవసరాలను తీరుస్తోంది. అంతేకాదు జంతు ప్రేమికులు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు.